వైఎస్సార్ ను తిడితే జగన్ వదిలేసినా మేం వదలం... చెంపచెళ్లుమనిపిస్తాం: తెలంగాణ మంత్రులకు రేవంత్ వార్నింగ్

Revanth Reddy warns Telangana ministers
  • వైఎస్ పై తెలంగాణ మంత్రుల తీవ్రవ్యాఖ్యలు
  • ఖండించిన రేవంత్ రెడ్డి
  • జగన్, విజయమ్మ వదిలేశారంటూ విమర్శ 
  • తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని స్పష్టీకరణ
ఇటీవల జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ మంత్రులు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తుండడం తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వైఎస్సార్ ను తిడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

"తెలంగాణ మంత్రులు వైఎస్సార్ ను ఇంతలా తిడుతున్నా జగన్, విజయమ్మ స్పందించడం లేదు. దీన్ని బట్టి చూస్తే వారిద్దరూ వైఎస్సార్ ను వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. వైఎస్ ను విధాన పరంగా ఎవరైనా విమర్శిస్తే తప్పులేదు. కానీ చనిపోయిన వ్యక్తి పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్ పేరు మీద ఏర్పాటు చేసుకున్న పార్టీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలు. జగన్ ఆ పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వాళ్లిద్దరూ వైఎస్ ను తిడుతుంటే ఖండించడంలేదు. వాళ్లు వైఎస్ ను వదిలేసుకున్నారని భావించాలేమో.

వైఎస్ ను తిడితే జగన్ వదిలేయొచ్చు... కానీ మేం మాత్రం వదిలిపెట్టం... వైఎస్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈ మంత్రుల చెంపచెళ్లుమనిపిస్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవు. వైఎస్సార్... తెలంగాణ కాంగ్రెస్ ఆస్తి. ఆయన బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు. చనిపోయే ముందు కూడా... రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు" అని వివరించారు.

తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్టీఆర్, వైఎస్సార్ ల పేర్లను లాగడం మానుకోవాలని తెలంగాణ మంత్రులకు రేవంత్ హితవు పలికారు. ఎన్టీఆర్, వైఎస్సార్ తమ పాలనలో చేయగలిగినంతా చేశారని, 10 నిర్ణయాల్లో అన్నీ అందరికీ నచ్చకపోవచ్చని, అంతమాత్రాన వారిని ఈ వివాదాలకు బాధ్యులను చేయడం సరికాదని అన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Ministers
YSR
Jagan
YS Vijayamma
Telangana
Andhra Pradesh

More Telugu News