Nellore District: తేజస్విని హత్య కలచివేసింది: వాసిరెడ్డి పద్మ

AP Women Commission Chief Vasireddy Padma visits Tejaswini body
  • ప్రేమోన్మాదులకు జీవించే హక్కు లేదు
  • దిశ చట్టం కింద వారం రోజుల్లోనే నిందితుడిపై చార్జ్‌షీట్
  • నిందితుడిని ఉరితీయాలంటూ టీడీపీ, బీజేపీ నాయకుల డిమాండ్
నెల్లూరు జిల్లా గూడూరులో యువకుడి చేతిలో హత్యకు గురైన ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని మృతదేహాన్ని ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ నిన్న సందర్శించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రేమ పేరుతో యువతులను వేధించి హతమార్చే ఉన్మాదులకు బతికే హక్కులేదన్నారు. ప్రేమించడం లేదన్న కోపంతో నిందితుడు వెంకటేశ్ ఆమెను హత్య చేయడం కలచివేసిందన్నారు.

100కు డయల్ చేసిన మూడు నిమిషాల్లోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అయితే, అప్పటికే తేజస్విని హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై దిశ చట్టం కింద వారం రోజుల్లోనే చార్జ్‌షీట్ తెరవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రేమోన్మాదులకు గుణపాఠం చెప్పేలా న్యాయస్థానాలు తీర్పులు ఉండాలని అన్నారు. మరోవైపు, గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, టీడీపీ, బీజేపీ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుని నిందితుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితుడు వెంకటేశ్‌కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
Nellore District
Gudur
Love
Murder
Vasreddy Padma

More Telugu News