CBI-ED Court: వైఎస్ జగన్ పిటిషన్ పై సీబీఐ-ఈడీ కోర్టులో విచారణ

CBI ED Court hearing on YS Jagan assets case
  • ఈ పిటిషన్ పై గత నెలలో విచారణ
  • నేటికి వాయిదా
  • ఇదే కేసులో విజయసాయిరెడ్డి మెమో దాఖలు
  • ఈడీ కేసులు వాయిదా వేసిన కోర్టు
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సీబీఐ-ఈడీ కోర్టులో విచారణ జరిగింది. తన బదులుగా విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ తన పిటిషన్ లో అర్థించారు. ఈ పిటిషన్ పై గత నెలలో విచారణ జరగ్గా, కోర్టు ఇవాళ్టికి (జులై 2) వాయిదా వేసింది. ఇదే కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేయగా, కోర్టు ఇవాళ విచారణ జరిపింది. హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న దృష్ట్యా ఈడీ కేసులు వాయిదా వేయాలని విజయసాయి కోర్టును కోరారు.

ఈ నేపథ్యంలో సీబీఐ-ఈడీ కోర్టు రాంకీ, వాన్ పిక్, జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడుల కేసులను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఇందూ టెక్ జోన్, దాల్మియా సిమెంట్స్, అరబిందో, లేపాక్షి, హెటెరో కేసుల విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.

ఇదిలావుంచితే, ఓఎంసీ కేసు విచారణ నిలిపివేయాలంటూ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. సరిహద్దు వివాదంపై దర్యాప్తు పూర్తయ్యేవరకు సీబీఐ కోర్టులో విచారణ ఆపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వాదనల సందర్భంగా... ఓఎంసీ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ అధికారులు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు పూర్తయిందన్న విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోర్టు సీబీఐ అధికారులను ఆదేశించింది.

అనంతరం, ఈ కేసులో శ్రీలక్ష్మిపై విచారణకు స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. శ్రీలక్ష్మి పిటిషన్ పై విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది.
CBI-ED Court
Jagan
Vijay Sai Reddy
Assets Case
Andhra Pradesh

More Telugu News