Jagan: దిశ బిల్లులకు ఆమోదం తెలపాలంటూ కేంద్రానికి లేఖ రాసిన సీఎం జగన్

CM Jagan wrote union government to faster approval of Disha bills
  • దిశ ఘటన తర్వాత ఏపీలో దిశ చట్టానికి రూపకల్ప
  • దిశ బిల్లులకు ఆమోదం
  • ఓసారి తిప్పి పంపిన కేంద్రం
  • సవరణలతో మరోసారి సమర్పించిన ఏపీ సర్కారు
తెలంగాణలో దిశ ఘటన అనంతరం ఏపీలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలను నిరోధించేందుకు దిశ పేరిట ఏపీ ప్రభుత్వం కఠిన చట్టం తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అయితే, దిశ బిల్లులకు ఇప్పటివరకు రాష్ట్రపతి ఆమోదం తెలుపని అంశాన్ని వివరిస్తూ నేడు సీఎం జగన్ కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. దిశ బిల్లులను రాష్ట్రపతి వెంటనే ఆమోదించేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రం మహిళల, బాలల సాధికారత లక్ష్యంగా మిషన్ పోషణ్, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య పేరిట అనేక కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయం అని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు పోషకాహారం, సంక్షేమం అందించడంతో పాటు వారికి భద్రత కల్పించడం కూడా అత్యవసరమని పేర్కొన్నారు. మహిళలు, చిన్నారులకు భరోసాతో కూడిన భద్రతను అందించడం ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల్లో ఒకటని స్పష్టం చేశారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లు, ఫోరెన్సిక్ ల్యాబ్ లు, సత్వర స్పందన కోసం హెల్ప్ డెస్కులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని, దిశ చట్టం రాకముందే తాము మహిళల భద్రత కోసం ఇన్ని చర్యలు తీసుకున్నామని కేంద్రమంత్రికి రాసిన తన లేఖలో సీఎం జగన్ వివరించారు. తాము తీసుకువచ్చిన దిశ కార్యాచరణకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని, దిశ యాప్, దిశ కమాండ్ కంట్రోల్, దిశ ఇన్వెస్టిగేషన్ వెహికిల్, దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లకు గాను 4 స్కోచ్ అవార్డులు కూడా లభించాయని తెలిపారు.

వీలైనంత త్వరగా ఈ బిల్లుల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని, తద్వారా రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తోడ్పాటు అందించాలని సీఎం జగన్ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా, గతంలో దిశ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదం అనంతరం కేంద్రానికి పంపగా, కేంద్రం తిప్పి పంపింది. కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసిన మేరకు సవరణలు చేసి మరోసారి ఏపీ ప్రభుత్వం దిశ బిల్లులను కేంద్రానికి పంపింది. అప్పటినుంచి రాష్ట్రపతి ఆమోదం పెండింగ్ లో ఉంది.
Jagan
Letter
Smriti Irani
Disha Bills
Approval
Andhra Pradesh

More Telugu News