YSRBima: 'వైఎస్ఆర్‌ బీమా' పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి జ‌గ‌న్!

CM YS Jagan launches ysr bima scheme
  • ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి
  • రూ.750 కోట్లతో, నూత‌న మార్గద‌ర్శ‌కాల‌తో ప్రారంభం
  •  సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా
  • 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా
'వైఎస్ఆర్‌ బీమా' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ ప‌ద్ధ‌తిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, రూ. 750 కోట్లతో నూత‌న మార్గద‌ర్శ‌కాల‌తో దీన్ని ప్రారంభించామని తెలిపారు.

18-50 ఏళ్ల మ‌ధ్య వ‌యసు ఉన్న వ్యక్తి సహజంగా మరణిస్తే రూ.లక్ష బీమా వస్తుందని తెలిపారు. అలాగే, 18-70 ఏళ్ల వారు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షల వరకు బీమా వస్తుందని , అంగవైకల్యానికి రూ.5 లక్షల బీమా ఇస్తారని చెప్పారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారందరికీ ఈ పథకం అందుతుంద‌ని తెలిపారు. 155214 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా ఈ ప‌థ‌కంపై సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు.

ఈ పథకం నుంచి గ‌త ఏడాది ఏప్రిల్ నుంచి కేంద్రం తప్పుకుందని ఆయ‌న చెప్పారు. అయిన‌ప్ప‌టికీ పేదలకు మేలు చేయాలని మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, బీమా చెల్లింపునకు అయ్యే పూర్తి ఖర్చు బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్ప‌ష్టం చేశారు. రెండేళ్లలో మొత్తం రూ.1,307 కోట్ల మేర బీమా రక్షణ అమలులో ఉందన్నారు. ప్ర‌జ‌ల‌కు ఈ బీమా గురించి తెలిపే బాధ్య‌త‌ల‌ను గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించామని తెలిపారు.
YSRBima
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News