COVID19: కొవిడ్ బాధితుల్లో సీఎంవీ ఇన్ఫెక్షన్.. ఒకరి మృతి

Five Covid patients at Ganga Ram hospital suffer rectal bleeding one dies
  • ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురిలో సీఎంవీ
  • రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నా ఇన్ఫెక్షన్
  • ఆపరేషన్ చేసి పెద్ద పేగులో కొంత భాగాన్ని తొలగించిన వైద్యులు
ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కొవిడ్ రోగుల్లో సైటోమెగాలో వైరస్ (సీఎంవీ) సంబంధిత మలద్వార రక్తస్రావం కనిపించినట్టు వైద్యులు తెలిపారు. వీరిలో ఒకరు చనిపోయినట్టు చెప్పారు. రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నప్పటికీ ఈ సమస్య వెలుగు చూడడం ఇదే తొలిసారని పేర్కొన్నారు.

కరోనా బారినపడిన 20-30 రోజుల తర్వాత వీరిలో ఈ లక్షణాలు కనిపించినట్టు వివరించారు. నిజానికి ఇప్పటి వరకు రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్న రోగుల్లో మాత్రమే అంటే.. కేన్సర్, ఎయిడ్స్ రోగులతోపాటు అవయవ మార్పిడి చేయించుకున్న వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించగా, తాజాగా రోగ నిరోధక శక్తి సాధారణంగా ఉన్నప్పటికీ ఈ ఐదుగురిలో సీఎంవీ ఇన్ఫెక్షన్‌ కనిపించినట్టు వైద్యులు తెలిపారు.

సీఎంవీ సమస్య కనిపించిన బాధితుల్లో కడుపు నొప్పి, మలవిసర్జన సమయంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపించినట్టు ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ అరోరా తెలిపారు. కొవిడ్ చికిత్స కోసం ఉపయోగించే స్టెరాయిడ్ల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గుతోందని, ఫలితంగా ఇలాంటి రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు.

అయితే, భారతీయ జనాభాలో 80-90 శాతం మందిలో సీఎంవీ సాధారణమేనని ఆయన వివరించారు. తాజాగా వెలుగుచూసిన కేసుల్లో ఇద్దరికి తీవ్ర రక్తస్రావం జరిగిందని, వీరిలో ఒకరికి అత్యవసర శస్త్రచికిత్స చేసి పెద్దపేగులో కొంత భాగాన్ని తొలగించినట్టు చెప్పారు. మరొకరు తీవ్ర రక్తస్రావం, కరోనా వల్ల చనిపోయినట్టు డాక్టర్ అనిల్ అరోరా తెలిపారు.
COVID19
CMV
Ganga Ram Hospital
New Delhi

More Telugu News