Sonia Gandhi: సోనియా గాంధీకి కృతజ్ఞత లేఖ రాయాలని టీపీసీసీ కొత్త కార్యవర్గం నిర్ణయం

TPCC Members Decided To Write Letter To Sonia Gandhi
  • మల్లు రవి ఇంట్లో నూతన కార్యవర్గం సమావేశం
  • రెండు గంటలపాటు వివిధ అంశాలపై చర్చ
  • అధిష్ఠానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతామన్న నేతలు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి కృతజ్ఞత లేఖ రాయాలని తెలంగాణ కాంగ్రెస్ నూతన కార్యవర్గం నిర్ణయించింది. పీసీసీ చీఫ్‌గా నియమితులైన రేవంత్‌రెడ్డితోపాటు కార్యనిర్వాహక అధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యక్షులు, కమిటీ చైర్మన్లు నిన్న మాజీ ఎంపీ మల్లు రవి నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలను చర్చించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పునర్‌వైభవం తెస్తామని, అధిష్ఠానం తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేలా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ప్రకటించింది.

సామాజిక న్యాయానికి ప్రాధాన్యమిస్తూ పీసీసీ కమిటీని ఏర్పాటు చేసిన అధిష్ఠానానికి నేతలు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను సోనియాగాంధీ మనిషినని, కొత్త కమిటీపై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడదామని చెప్పినట్టు సమాచారం. తక్కువ సమయంలోనే అధిష్ఠానం తనను గుర్తించి కీలక పదవుల్ని ఇచ్చిందని, ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకుపోతానని పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీనియర్ నేతలు దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, సురేశ్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, జి. నిరంజన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Sonia Gandhi
Revanth Reddy
TPCC
Telangana

More Telugu News