Andhra Pradesh: ఏపీ మంత్రుల ఇళ్లను ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి సంఘ నేతలు.. అరెస్ట్

Student unions tried to attack minister residences
  • ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ పై నిరసన జ్వాలలు
  • వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని నిరసన
  • మొత్తం ఖాళీలతో కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై విద్యార్థి సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించేందుకు యత్నించారు. తిరుపతిలో పెద్దిరెడ్డి, విజయనగరంలో బొత్స, విశాఖలో అవంతి శ్రీనివాస్ ఇళ్లను ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర మంత్రుల నివాసాలను ముట్టడించేందుకు యత్నించిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు  ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన బీజేవైఎం నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మండిపడ్డారు. ప్రతి సంవత్సరం లక్షల సంఖ్యలో విద్యార్థులు తమ చదువును పూర్తి చేసుకుంటుంటే... ప్రభుత్వం మాత్రం జాబ్ క్యాలెండర్ లో నామమాత్రంగా ఖాళీలను చూపించిందని విమర్శించారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలతో కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Job Calender
Student Unions
protests

More Telugu News