Vijayasai Reddy: అశోక్ చట్టవిరుద్ధ చర్యలపై ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయి: విజయసాయిరెడ్డి

Vijayasaireddy once again fires on Ashok Gajapathi Raju
  • మాన్సాస్ ట్రస్టు నేపథ్యంలో విజయసాయి ఫైర్
  • అశోక్ హయాంలో ట్రస్టుకు నష్టం జరిగిందన్న విజయసాయి
  • మాన్సాస్ ను భ్రష్టు పట్టించాడని విమర్శలు
  • అధికారులు అశోక్ ముసుగు తీస్తారని వెల్లడి
మాన్సాస్ ట్రస్టు నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. అశోక్ గజపతిరాజు హయాంలో మాన్సాస్ ట్రస్టుకు జరిగిన నష్టం అపారం అని విజయసాయి వెల్లడించారు. అధికారులు ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారని, ఇదే స్థాయిలో ఏదైనా ప్రైవేటు సంస్థలో నష్టం జరిగుంటే ఈపాటికి అశోక్ ను పీకి పారేసేవారని స్పష్టం చేశారు. అది దివాణా పాలన కాబట్టి అడిగే దిక్కేలేదని వ్యాఖ్యానించారు.

అయితే అశోక్ చట్టవిరుద్ధ చర్యలపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తెలిపారు. మాన్సాస్ ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ కు చాలాకాలం పడుతుందని అభిప్రాయపడ్డారు. దొంగలు ఆనవాళ్లను ఎలా చెరిపేస్తారో అధికారులకు బాగా తెలుసని, అశోక్ ముసుగు తీసి అతని అక్రమాలను బహిర్గతం చేసే ఆధారాలు వారి కళ్లముందు ఉన్నాయని విజయసాయి పేర్కొన్నారు. ఇవాళ తానేదో బాధితుడైనట్టు పూసపాటి అశోక్ గుండెలు బాదుకుంటున్నాడని, అస్తవ్యస్త పాలనతో మాన్సాస్ విద్యాసంస్థలను భ్రష్టుపట్టించిన అసమర్థుడు అని విమర్శించారు.

ఏళ్ల తరబడి తప్పుడు డేటా అప్ లోడ్ చేసినందువల్లే మాన్సాస్ కు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందలేదని స్పష్టం చేశారు. చైర్మన్ గా అశోక్ ఏళ్ల తరబడి మాన్సాస్ సిబ్బంది పనితీరును పర్యవేక్షించకుండా నిర్లక్ష్యం చేశాడని, ఫలితంగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వెల్లడించారు. అయితే, సంచయిత సకాలంలో జోక్యం చేసుకోవడంతో ఆ విద్యార్థులకు డిగ్రీలు వచ్చాయని తెలిపారు. లేకపోతే అశోక్ నిర్లక్ష్యానికి విద్యార్థుల జీవితాలు బలయ్యేవని పేర్కొన్నారు. చైర్మన్ పదవి అశోక్ కు అలంకారం మాత్రమేనని, బాధ్యత కాదని విమర్శించారు.

మాన్సాస్ ట్రస్టుకు కనీసం లీగల్ హెడ్ ను నియమించలేదని, ఒక కేసులో ట్రస్టు తరఫున వాదించే న్యాయవాది లేక కోర్టు ఏకపక్షంగా తీర్పు చెప్పేసిందని విజయసాయి వెల్లడించారు. ఫలితంగా రూ.13 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. ట్రస్టుకు చెందిన భూముల్లో ఇసుక తవ్వకాలను కారుచౌకగా పచ్చగ్యాంగుకు కట్టబెట్టాడని విజయసాయి ఆరోపించారు.
Vijayasai Reddy
Ashok Gajapathi Raju
Mansas Trust
Vijayawada
Andhra Pradesh

More Telugu News