Rahul Gandhi: శివసేన పత్రిక 'సామ్నా'లో రాహుల్​ పై విమర్శలు.. పవార్ పై ప్రశంసలు!

Shiva Sena Mouth Piece Saamna Criticizes Rahul Gandhi
  • ప్రధానిపై విమర్శలు ట్విట్టర్ లోనే
  • ప్రతిపక్షాలను ఏకం చేయడంలో విఫలం
  • అందులో శరద్ పవార్ సక్సెస్
  • కేంద్రంలో ప్రతిపక్షం బలహీనం
  • ‘సామ్నా’లో ఎడిటోరియల్ వ్యాసం
రాహుల్ గాంధీపై శివసేన పత్రిక సామ్నా విమర్శలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడంలో రాహుల్ కేవలం ట్విట్టర్ కే పరిమితమయ్యారని పేర్కొంటూ ఎడిటోరియల్ వ్యాసం రాసింది. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడంలో ఆయన విఫలమయ్యారంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి శివసేన అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయవంతం అయ్యారని కొనియాడింది. 8 పార్టీలతో ఢిల్లీ 6 జన్ పథ్ లోని పవార్ ఇంట్లో సమావేశాన్ని ఉటంకించింది.

ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి పూర్తిగా మారిపోయిందని ఎడిటోరియల్ లో పేర్కొంది. దేశంలో పరిస్థితులు అస్సలు బాగాలేవని, జనంలో ప్రభుత్వంపై కోపం పెరిగినా తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదన్న ఆత్మవిశ్వాసం బీజేపీలో కనిపిస్తోందని చెప్పింది. బలహీన, ఐక్యత లేని ప్రతిపక్షమే దానికి కారణమని విమర్శించింది. రాష్ట్రమంచ్ కు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. శరద్ పవార్ లాగానే రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని రాసుకొచ్చింది.

ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వానికి మునుపు ఉన్నంత పేరు ఇప్పుడు లేదని పేర్కొంది. గ్రాఫ్ భారీగా పడిపోయిందని, కానీ, సరైన ప్రతపక్షం లేకపోవడంతో దానిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని చెప్పింది. కొన్ని ప్రతిపక్షాలు కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించాయని, దానిని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిపెట్టాలంది. ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయగల శక్తి శరద్ పవార్ కు ఉందని, కానీ, నాయకత్వ సమస్యే అతిపెద్ద సవాల్ అని పేర్కొంది. ఒకవేళ కాంగ్రెస్ కు అప్పగిద్దామనుకున్నా.. ఆ పార్టీకే చాలా నెలల నుంచి ‘చీఫ్’ లేక కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేసింది. పవార్ కు రాహుల్ కూడా మద్దతునిస్తే బలమైన ప్రతిపక్షాన్ని తయారు చేయవచ్చని సూచించింది.
Rahul Gandhi
Shiv Sena
Narendra Modi
Sharad Pawar
Congress

More Telugu News