Allopathy: ఇంగ్లిష్ మందులు రాసేందుకు ఆయుర్వేద వైద్యులకు ఉత్తరాఖండ్ అనుమతి.. విడ్డూరంగా ఉందన్న ఐఎంఏ

Ayurvedic doctors to prescribe allopathic medicines in Uttarakhand
  • కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయోజనాల కోసమేనన్న ప్రభుత్వం
  • ‘మిక్సోపతి’ చట్ట విరుద్ధమన్న ఐఎంఏ
  • అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకన్న సీనియర్ వైద్యుడు జేఎన్ నౌటియాల్

ఆయుర్వేద వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి మందులు రాయొచ్చంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని మారుమూల కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయుష్ మంత్రి హరక్ సింగ్ రావత్ పేర్కొన్నారు. ఇటువంటి ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువగా ఆయుర్వేద వైద్యులే అందుబాటులో ఉంటారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

అయితే, ఆయుర్వేద వైద్యులు ఇంగ్లిష్ మందులు సిఫారసు చేయొచ్చన్న ప్రభుత్వ నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది చట్టవిరుద్ధమని ఉత్తరాఖండ్ ఐఎంఏ కార్యదర్శి అజయ్ ఖన్నా అన్నారు. ఇలాంటి ‘మిక్సోపతి’ వైద్యం చెల్లదని సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇది వరకే చెప్పాయన్నారు.

అయితే, ఉత్తరాఖండ్‌కు చెందిన భారతీయ చికిత్స పరిషత్ ఉపాధ్యక్షుడు, సీనియర్ వైద్యుడు జేఎన్ నౌటియాల్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఎమర్జెన్సీ వార్డుల్లోను, ఐసీయూల్లోనూ ఆయుష్ వైద్యులు పనిచేస్తున్నారని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఐఎంఏను ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News