KCR: దండం పెట్టి చెపుతున్నా.. పుకార్లను మానుకోండి: కేసీఆర్

Dont spread lies on corona third wave says KCR
  • కరోనా వల్ల ఇప్పటికే ప్రజలు లక్షలు కుమ్మరించారు
  • నాకు కూడా ఆ కరోనా వచ్చి పాడైంది
  • రెండు ట్యాబ్లెట్స్ మాత్రమే వేసుకున్నా
కరోనా వైరస్ మూడో వేవ్ రాబోతోందంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని... ఈ సమయంలో ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం సరికాదని అన్నారు. స్కూళ్లు లేకపోవడంతో... చిన్నపిల్లలు ఇళ్లను అంగడంగడి చేస్తున్నారని చెప్పారు.

థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండబోతోందంటూ పుకార్లను పుట్టిస్తున్నారని... పుకార్లను పుట్టిస్తున్నవారికి కరోనా వైరస్ ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పిందా? అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కరోనా వల్ల పుస్తల తాళ్లను సైతం అమ్ముకుని జనాలు లక్షలు కుమ్మరించారని అన్నారు. దండం పెట్టి చెపుతున్నానని... దయచేసి ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరారు.

జనాలను భయపెట్టే పనులను మానుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. తనకు కూడా ఆ కరోనా వచ్చి పాడైందని... దాని గురించి మాట్లాడితే పెద్ద పంచాయతీ అవుతుందని అన్నారు. బీమార్ ఏందో దొరికిందా అని తాను డాక్టర్లను అడిగానని... ట్రయల్ అండ్ ఎర్రర్ అని వాళ్లు చెప్పారని తెలిపారు. తనది అసలే బక్క ప్రాణమని... ఇష్టమొచ్చిన గోళీలు వేయకండని చెప్పానని... రెండే రెండు గోళీలు వేసుకున్నానని చెప్పారు. ఒకటి యాంటీ బయాటిక్, మరొకటి పారాసిటమాల్ అని తెలిపారు. జనాలను భయోత్పాతానికి గురి చేసేలా ప్రచారాలు చేయవద్దని... మీడియా కూడా ఈ విషయాన్ని గుర్తించాలని విన్నవించారు. ప్రజల బతుకులతో ఆడుకోవద్దని కోరారు.
KCR
TRS
Corona Virus

More Telugu News