Anil Kumar Yadav: మీరు చేస్తే తప్పులేదు... మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా?: తెలంగాణపై ఏపీ మంత్రి అనిల్ ఫైర్

AP Minister Anil Kumar slams Telangana on irrigation projects
  • మరింత వివాదాస్పదంగా తెలుగు రాష్ట్రాల జలవివాదాలు
  • తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందన్న అనిల్
  • ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని వెల్లడి
  • చుక్కనీరు అదనంగా తీసుకోవడంలేదని స్పష్టీకరణ
ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు మరింత జటిలం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ స్పందించారు. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులపై ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, భవిష్యత్తులోనూ ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సుంకేశుల వద్ద తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టు సక్రమమైందా? అని ప్రశ్నించారు. మీరు చేస్తే తప్పు లేదు... మేం నిబంధనల ప్రకారం చేస్తే తప్పా? అంటూ అనిల్ నిలదీశారు.

ఏపీలో ఎక్కడా అక్రమ ప్రాజెక్టులు నిర్మించడం లేదని స్పష్టం చేశారు. కృష్ణా నది నుంచి సరిపడా నీరు తీసుకునేందుకే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు అని వివరణ ఇచ్చారు. చట్టానికి లోబడే రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఏపీకి కేటాయించిన నీటి వాటాను ఎక్కడా అతిక్రమించలేదని పేర్కొన్నారు.

శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తీసుకునే వీలుంటుందని వివరించారు. శ్రీశైలంలో 848 అడుగులుంటే చుక్కనీరు తీసుకోలేని పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని 15 రోజుల పాటే పొందగలిగే పరిస్థితి ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు వద్ద లిఫ్టు ఏర్పాటు తప్పు ఎలా అవుతుందో తెలంగాణ చెప్పాలని నిలదీశారు.

కృష్ణా నది నుంచి తాము చుక్క నీరు కూడా ఎక్కువగా తీసుకోవడంలేదని ఉద్ఘాటించారు. అయితే, తెలంగాణ 6 టీఎంసీల ప్రాజెక్టులను అక్రమంగా నిర్మిస్తోందని మంత్రి అనిల్ ఆరోపించారు. శ్రీశైలంలో నీటిమట్టం 800 అడుగులు ఉన్నా సరే, లిఫ్టు చేసేలా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని వివరించారు. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల సామర్థ్యం పెంచారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోనూ లిఫ్టు ఏర్పాటు చేశారని  తెలిపారు.

అధికారుల స్థాయిలో జల వివాదాలు పరిష్కారం కావని మంత్రి అనిల్ అభిప్రాయపడ్డారు. నీటి వాటాలపై ఐదేళ్లుగా తాము పోరాడుతూనే ఉన్నామని వెల్లడించారు. సీఎం జగన్ తెలంగాణకు స్నేహహస్తం అందించినా ప్రయోజనం కలగలేదని విచారం వ్యక్తం చేశారు.
Anil Kumar Yadav
Irrigation Projects
Andhra Pradesh
Telangana
Jagan

More Telugu News