Congress: శ్రీరాముడి పేరుతో సేకరించిన నిధులను బీజేపీ నేతలు దోచుకుంటున్నారు: కాంగ్రెస్ అధికార ప్రతినిధి విమర్శలు

Congress Alleges Another Land Scam In Ayodhya
  • రామ మందిర నిర్మాణం కోసం జరిగిన భూముల కొనుగోళ్లలో అవకతవకలు
  • రూ. 20 లక్షలకు కొన్న భూమిని బీజేపీ నేత రూ. 2.5 కోట్లకు విక్రయించారు
  • విచారణ జరిపించాల్సిన బాధ్యత మోదీ, సుప్రీంకోర్టుదే
  • కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం సేకరించిన నిధులను బీజేపీ నేతలు ఇంకా దోచుకుంటూనే ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది. రామమందిర నిర్మాణం కోసం కొనుగోలు చేసిన భూముల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంది. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్రమోదీతోపాటు సుప్రీంకోర్టు ఇంకా మౌనంగానే ఉండడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాల ప్రశ్నించారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు తక్షణం స్పందించి న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తునకు ఆదేశించడం ద్వారా తమ బాధ్యతలు నిర్వర్తించాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బీజేపీ నేత ఒకరు అయోధ్యలో 890 చదరపు మీటర్ల భూమిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసి 79 రోజుల తర్వాత ఆ భూమిని రామజన్మభూమి ట్రస్టుకు రూ. 2.5 కోట్లకు విక్రయించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని, ప్రధాని ఆధ్వర్యంలోనే రామజన్మభూమి ట్రస్టు ఏర్పాటైంది కాబట్టి ఈ అక్రమాలపై స్పందించి విచారణ జరిపించాల్సిన బాధ్యత కూడా వారిదేనని సూర్జేవాల స్పష్టం చేశారు.
Congress
Ayodhya Ram Mandir
Randeep Surjewala

More Telugu News