Corona Virus: పాకిస్థాన్‌కు 15 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిన చైనా

China sent 15 lakh Sinovac Vaccine doses to Pakistan
  • ప్రత్యేక విమానంలో పాకిస్థాన్ చేరుకున్న టీకాలు
  • మరో వారంలో 50 లక్షల డోసులు పంపనున్న చైనా
  • పాకిస్థాన్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతున్న వైరస్ ప్రభావం
చైనా తన మిత్రదేశమైన పాకిస్థాన్‌కు 15 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపింది. వచ్చే వారం మరో 50 లక్షల డోసులు చైనా నుంచి తమకు అందనున్నట్టు పాకిస్థాన్ తెలిపింది. కరోనా వైరస్‌కు విరుగుడుగా చైనా తయారుచేసిన సినోవాక్ టీకాను దిగుమతి చేసుకునేందుకు పాకిస్థాన్ ఇప్పటికే చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే నిన్న ప్రత్యేక విమానంలో చైనా నుంచి పాకిస్థాన్‌కు 15 లక్షల డోసుల సినోవాక్ టీకాలు చేరుకున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ నేషనల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఎన్‌సీఓసీ) తెలిపింది.

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, రోజుకు దాదాపు 3 లక్షల డోసులను పంపిణీ చేస్తున్నట్టు పాక్ మంత్రి, ఎన్‌సీఓసీ చీప్ అసద్ ఉమర్ తెలిపారు. గత వారం రోజుల్లోనే ఏకంగా 23 లక్షల టీకాలను పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్‌లో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. నిన్న అక్కడ 1050 కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9.48 లక్షలకు చేరుకుంది. కాగా, నిన్న 37 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
Corona Virus
Pakistan
China
Sinovac

More Telugu News