Andhra Pradesh: తెలంగాణ రైతాంగ ప్రయోజనాల కోసం.. ఏపీతో తాడోపేడో తేల్చుకోవాలని కేబినెట్ నిర్ణయం

Telangana Cabinet ready to fight with AP on Irrigation Sector
  • కేంద్రం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలను ఏపీ బేఖాతరు చేస్తోంది
  • ఏపీ తీరుపై న్యాయస్థానాలను ఆశ్రయించాలని నిర్ణయం
  • ప్రధాని, కేంద్ర జలశక్తి మంత్రికి వినతిపత్రాలు
  • తెలంగాణ వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయం
రైతుల ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత నిన్న ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో సాగునీటి పారుదల రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణా బేసిన్‌లో ఏపీ నిర్మిస్తున్న అనుమతి లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించినా పట్టించుకోకపోవడాన్ని కేబినెట్ తీవ్రంగా పరిగణించింది. ఏపీ తీరుపై న్యాయస్థానాల్లోను, ప్రజా క్షేత్రంలోను తేల్చుకోవాలని నిర్ణయించింది. అంతేకాదు, పార్లమెంటు సమావేశాల్లోనూ దీనిపై ప్రస్తావించాలని, ఏపీ ప్రాజెక్టుల కారణంగా తెలంగాణలో జరగబోయే నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.

ప్రధానమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించనుంది. ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులను నిలుపుదల చేయించాలని కోరాలని నిర్ణయించింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా హైదరాబాద్‌కు తాగునీరుతోపాటు పలు జిల్లాలకు సాగునీరు విషయంలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడిన కేబినెట్.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడి ఏడు సంవత్సరాలు అయినా కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా నిర్ధారణ కాకపోవడంపై కేబినెట్ ఆవేదన వ్యక్తం చేసింది.
Andhra Pradesh
Telangana
Cabinet Meet
Irrigation sector
Krishna River

More Telugu News