Serum Institute: పిల్లలపై నొవావాక్స్ కరోనా టీకా క్లినికల్‌ ట్రయల్స్‌: సీరం

serum is going to start Novavax clinical trials in children by july
  • జులై నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడి
  • పిల్లలపై పరీక్షలకు సిద్ధమైన నాలుగో వ్యాక్సిన్‌
  • ప్రారంభమైన కొవాగ్జిన్‌, జైకొవ్‌-డి ప్రయోగాలు
  • సెప్టెంబరులో భారత్‌లోకి నొవావాక్స్‌ టీకా
భారత్‌లో పిల్లలపై నొవావాక్స్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) సిద్ధమైంది. జులై నుంచి ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. దీంతో భారత్‌లో పిల్లలపై ప్రయోగ దశకు చేరుకున్న నాలుగో వ్యాక్సిన్‌గా నొవావాక్స్ నిలవనుంది.

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ ఇప్పటికే పిల్లల్లో కొవాగ్జిన్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రారంభించింది. అలాగే తాము తయారు చేసిన ముక్కు ద్వారా ఇచ్చే టీకా క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా పిల్లపైనా ప్రయోగిస్తున్నారు. మరోవైపు జైడస్‌ క్యాడిలా అభివృద్ధి చేసిన కరోనా టీకా జైకొవ్‌-డిని 12-18 ఏళ్ల మధ్య వయస్సు వారిపై పరీక్షిస్తున్నారు. 5-12 ఏళ్ల మధ్య వయస్సు వారిపైనా పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో తమ టీకా 90.4 శాతం సమర్థత కనబరిచిందని అమెరికాకు చెందిన నొవావాక్స్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త వేరియంట్లపైనా తమ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తోందని తెలిపింది. భారత్‌లో ఈ టీకా తయారీకి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే సెప్టెంబరు కల్లా టీకాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇటీవల సీరం తెలిపింది.
Serum Institute
Novavax
Corona Virus
Corona vaccine
COVAXIN

More Telugu News