Sonu Sood: సోనూ సూద్, జీషన్ సిద్ధిఖీలకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఎక్కడ నుంచి వచ్చాయి?: బాంబే హైకోర్టు

Bombay high court hearing on procuring Remdesivir injections

  • కరోనా చికిత్సలో కీలకంగా రెమ్ డెసివిర్
  • అనేకమందికి ఇంజెక్షన్లు సమకూర్చిన సోనూ
  • ఎన్జీవో ద్వారా సేవలందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ 
  • ఇద్దరిపై ఫిర్యాదులు అందాయన్న సర్కారు

కరోనా తీవ్రంగా ఉన్న దశలో నటుడు సోనూ సూద్ అనేకమంది రోగులకు, వారి బంధువులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కూడా ఇదే రీతిలో బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు సమకూర్చారు. అయితే, కరోనా చికిత్సలో కీలకంగా మారిన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వచ్చాయంటూ బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వివరణ ఇచ్చింది.

రెమ్ డెసివిర్ ఇంజక్షన్లు కలిగి ఉండడంపై సోనూ సూద్, జీషన్ సిద్ధిఖీలపై క్రిమినల్ ఫిర్యాదులు దాఖలయ్యాయని వెల్లడించింది. సిద్ధిఖీ బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు వితరణ చేశారని, ఇక సోనూ సూద్ లైఫ్ లైన్ మెడికేర్ ఆసుపత్రిలోని దుకాణాల ద్వారా రెమ్ డెసివిర్ పొందారని అడ్వొకేట్ జనరల్ అశుతోష్ కుంభకోణి కోర్టుకు వివరించారు. సిద్ధిఖీ తన వద్దకు వచ్చిన వారికి నేరుగా రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వకుండా వారిని బీడీఆర్ ఫౌండేషన్ కు మళ్లించారని, ఆయనపై ఫిర్యాదు వచ్చినా కేసు నమోదు కాలేదని తెలిపారు. ట్రస్టుకు సంబంధించిన వారిపై కేసులు నమోదైనట్టు వివరించారు.

సోనూ సూద్ పంపిణీ చేసిన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు భివాండీలోని సిప్లా ఫార్మా సంస్థ నుంచి వచ్చాయని, ఇవి ప్రభుత్వ కేటాయింపుల్లోనివి కావని, దీనిపై విచారణ పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.

దీనిపై బాంబే హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ... వీళ్లిద్దరూ తమను తాము దైవదూతలుగా భావిస్తూ, కనీసం ఆ ఔషధాల పంపిణీ చట్టబద్ధమో, కాదో తెలుసుకోకుండా వ్యవహరించారని పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 'ప్రభుత్వం మీకోసం ఏమీ చేయలేకపోతోంది, కానీ మీకోసం మేం చేస్తున్నాం అంటూ వీళ్ల తరహాలోనే రేపు మరొకరు వస్తారు' అంటూ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

Sonu Sood
Zeeshan Siddiqui
Remdesivir
Bombay High Court
Maharashtra
Corona Pandemic
  • Loading...

More Telugu News