Green Fungus: ఇండోర్ లో గ్రీన్ ఫంగస్ కేసు.. ఎయిర్ అంబులెన్సులో ముంబైకి పేషెంట్ తరలింపు!

Green fungus case found in Madhya Pradesh
  • ఇప్పటికే బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్ లు
  • కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో తాజాగా గ్రీన్ ఫంగస్ 
  • పేషెంట్ ముక్కు నుంచి కారుతున్న రక్తం
కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ లు బయటపడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో ఈ ఫంగస్ వెలుగుచూసింది. కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తిలో ఈ ఫంగస్ ను గుర్తించారు. దీంతో సదరు పేషెంట్ ని హుటాహుటిన ఇండోర్ నుంచి ముంబైకి ఎయిర్ అంబులెన్సులో తరలించారు.

ఈ సందర్భంగా ఇండోర్ లోని శ్రీ అరబిందో ఇస్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి ఛాతీ వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ రవి దోసి మాట్లాడుతూ, తొలుత ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకిందని తాము అనుమానించామని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహించగా... ఆయన సైనస్, లంగ్స్, బ్లడ్ లో గ్రీన్ ఫంగస్ అభివృద్ధి చెందినట్టు బయటపడిందని తెలిపారు. పేషెంట్ ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైలోని హిందుజా ఆసుపత్రికి తరలించామని చెప్పారు.

సదరు పేషెంట్ ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నాడని... అయితే, ఆ తర్వాత ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం వంటి వాటితో ఆయన బాధపడ్డారని డాక్టర్ రవి తెలిపారు. అంతేకాదు, ఆయన బరువు తగ్గి, చాలా బలహీనంగా మారారని చెప్పారు. గ్రీన్ ఫంగస్ పై రీసెర్చ్ జరగాల్సి ఉందని... కరోనా నుంచి కోలుకున్న వారిపై ఈ ఫంగస్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Green Fungus
Indore
Madhya Pradesh

More Telugu News