Uttar Pradesh: ప్రధాని మోదీని కలిసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​

UP CM Yogi meets Prime Minister Narendra Modi
  • ప్రధాని నివాసంలో సమావేశం
  • త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు
  • పార్టీ నాయకత్వ మార్పుపై ఊహాగానాలు
  • ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ
ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు కలిశారు. న్యూఢిల్లీలోని ప్రధాని నివాసానికి వెళ్లి సమావేశమయ్యారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గ మార్పులు తథ్యమన్న ఊహాగానాల మధ్య ఆయన ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ప్రధానిని యోగి కలిశారన్న చర్చ సాగుతోంది. బుధవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ , ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ తో బుధవారం రాత్రి యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. సమావేశానికి సంబంధించిన నివేదికను పార్టీ అధిష్ఠానానికి అందించడం కోసమే యోగి రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇది ఎప్పుడూ జరిగే సాధారణ సమావేశమేనని యూపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. సునీల్ బన్సాల్ హెలికాప్టర్ లో హుటాహుటిన లక్నోకు రావడం, సమావేశానికి హాజరు కావడం వంటి పరిణామాలు రాష్ట్రంలో పార్టీ నాయకత్వ మార్పుల కోసమేనన్న చర్చ నడుస్తోంది. కరోనా కట్టడిలో యోగి సర్కార్ ఘోరంగా విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో యోగి సమావేశమైన సంగతి తెలిసిందే.
Uttar Pradesh
Yogi Adityanath
Prime Minister
Narendra Modi

More Telugu News