Anil Kumar Yadav: మాటలు నీకే కాదు మాకూ వచ్చు: లోకేశ్ పై మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు

AP Minister Anil Kumar slams Nara Lokesh
  • పోలవరంపై మంత్రి అనిల్ సమీక్ష
  • ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడంటూ విమర్శలు
  • చినబాబులో అసహనం ఏర్పడిందని వెల్లడి
  • హెరిటేజ్ దున్నపోతువా అంటూ వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష సందర్భంగా ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పై ధ్వజమెత్తారు. మూడు శాఖలకు మంత్రిగా చేసినా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని ఎద్దేవా చేశారు. మరో ఏడాదిలో ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తి కానుందని, దాంతో అసహనం తారస్థాయికి చేరుతోందని విమర్శించారు. అందుకే జూమ్ లో సీఎం జగన్ గురించి విమర్శలు చేస్తున్నాడని, సీఎం జగన్ గురించి మాట్లాడేందుకు ఒక్కశాతమైనా అర్హత ఉందా? అని ప్రశ్నించారు.

 "మాటలు నీకే కాదు... మాక్కూడా వచ్చు. జగన్ ను అమూల్ బేబీ అంటున్నావ్... నువ్వు హెరిటేజ్ దున్నపోతువా?" అని నిలదీశారు. తాత, తండ్రీ సీఎంలుగా చేశారు అని చెప్పుకున్నా గెలవలేకపోయావు అంటూ విమర్శించారు.

ఇక, పోలవరం ప్రాజెక్టు గురించి చెబుతూ,  రైతుల ముఖాల్లో సంతోషం చూడలేకపోతున్న టీడీపీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్ర చేస్తోందని వెల్లడించారు. పోలవరం పూర్తయితే సీఎం జగన్, వైఎస్సార్ పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని, అందుకే రఘురామకృష్ణరాజు వంటివారితో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామని మంత్రి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News