Mynmar: ఆంగ్​ సాన్​ సూకీపై అవినీతి కేసుపెట్టిన మయన్మార్​ సైనిక పాలకులు

Mayanmar Junta Charges Aung San Suu Kyi over Corruption
  • 6 లక్షల డాలర్లు లంచంగా తీసుకున్నారని ఆరోపణ
  • 11 కిలోల బంగారాన్ని పొందారని చార్జ్
  • పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలు చేశారన్న అభియోగాలు
  • కొట్టిపారేసిన సూకీ తరఫు న్యాయవాది
  • రాజకీయాలకు దూరం చేసే ఎత్తుగడ అని వ్యాఖ్య
మయన్మార్ ప్రజా నేత ఆంగ్ సాన్ సూకీపై ఆ దేశ సైనిక పాలకులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమెపై అవినీతి కేసు పెట్టారు. అక్రమ మార్గాల్లో బంగారం, 5 లక్షల డాలర్లకుపైగా సొమ్మను లంచంగా తీసుకున్నారని సైనిక ప్రభుత్వం ఆరోపించింది. ఫిబ్రవరి 1న ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసిన ఆ దేశ సైన్యం పాలనను అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆ దేశంలో ఆందోళనలు సాగుతున్నాయి. జుంటా కాల్పుల్లో 850 మందికిపైగా పౌరులు మరణించారు.

అప్పట్నుంచి ఆర్మీ అదుపులోనే ఉన్న సూకీపై ఎన్నెన్నో నేరాభియోగాలను సైన్యం మోపింది. దేశద్రోహం, బ్రిటీష్ కాలం నాటి గోప్యతా చట్టాల ఉల్లంఘన వంటి ఆరోపణలను మోపింది. ఇప్పుడు 6 లక్షల డాలర్లు, 11 కిలోల బంగారాన్ని సూకీ అక్రమంగా పొందారని యాంగోన్ రీజియన్ చీఫ్ మినిస్టర్ అన్నారు. అవినీతి నిరోధక కమిషన్ అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించిందన్నారు.

పదవిని అడ్డంపెట్టుకుని ఆమె ఎన్నెన్నో అక్రమాలకు పాల్పడిందన్నారు. కాబట్టి అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 55 ప్రకారం ఆమెపై కేసు నమోదు చేశామన్నారు. తమ  స్వచ్ఛంద సంస్థ కోసం ఇంటిని అద్దెకు తీసుకునే సమయంలోనూ అధికారులను సూకీ బెదిరించారన్నారు.

అయితే, ఆ ఆరోపణలను సూకీ లాయర్ ఖిన్ మౌంగ్ జా ఖండించారు. ఇలాంటి ఆరోపణలు చేయడం చిత్రమన్నారు. ఆమె గౌరవానికి భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఆమె పేరు వినపడకుండా చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
Mynmar
Aung San Suu Kyi
Junta

More Telugu News