Biological E: దేశంలో మరో విదేశీ వ్యాక్సిన్ కు రంగం సిద్ధం

Hyderabad firm Biological E signed a deal for Providence vaccine in India
  • భారత్ లో అనుమతుల కోసం విదేశీ టీకాల నిరీక్షణ
  • కెనడా సంస్థ ప్రావిడెన్స్ తో బయోలాజికల్ ఈ సంస్థ ఒప్పందం
  • కెనడా వ్యాక్సిన్ కు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ
  • అత్యవసర అనుమతుల కోసం దరఖాస్తు చేసే అవకాశం
అన్నీ అనుకూలిస్తే త్వరలోనే భారత్ లో విదేశీ కరోనా వ్యాక్సిన్లు డోసులు వెల్లువెత్తనున్నాయి. ఇప్పటికే రేసులో మోడెర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలు అనుమతుల కోసం వేచిచూస్తున్నాయి. తాజాగా, కెనడాకు చెందిన ప్రావిడెన్స్ థెరప్యుటిక్స్ హోల్డింగ్స్ సంస్థ రూపొందించిన ఎంఆర్ఎన్ఏ కొవిడ్ వ్యాక్సిన్ (పీటీఎక్స్-కొవిడ్19-బి) భారత్ లో ప్రవేశానికి రంగం సిద్ధమవుతోంది. హైదరాబాదుకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ బయోలాజికల్ ఈ... ప్రావిడెన్స్ సంస్థతో లైసెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

దీని ప్రకారం కెనడా వ్యాక్సిన్ కు బయోలాజికల్ ఈ సంస్థ భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనుంది. కేంద్రం నుంచి అత్యవసర వినియోగానికి అనుమతులు కోరనుంది. కాగా, ఒప్పందంలో భాగంగా ప్రావిడెన్స్ సంస్థ బయోలాజికల్ ఈ సంస్థకు 30 మిలియన్ డోసులను విక్రయించనుంది. టీకా ఉత్పత్తికి సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని కూడా బదలాయించనుంది.

కాగా, ఈ ఒప్పందం ప్రకారం వంద కోట్ల డోసులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా, 2022 నాటికి 600 మిలియన్ డోసులు తయారుచేయనున్నారు. బయోలాజికల్ ఈ సంస్థ ఇప్పటికే జాన్సన్ అండ్ జాన్సన్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి కూడా వేరే ఒప్పందం కుదుర్చుకుంది. ఏటా 600 మిలియన్ డోసుల జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను ఉత్పత్తి చేయనుంది.
Biological E
Providence Theraputics Holdings
Canada Vaccine
PTX Covid19-B
India

More Telugu News