Raveendranath Chowdary: టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో మరో విషాదం.. రెండో కుమారుడి మృతి

TDP Former MP Maganti Babu son Raveendranath died in a hotel
  • హోటల్ గదిలో విగతజీవుడిగా రవీంద్రనాథ్ చౌదరి
  • రక్తపు వాంతులు చేసుకుని చనిపోయిన చౌదరి
  • ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కన్నుమూత
టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబంలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్ చౌదరి అనుమానాస్పద స్థితిలో విగతజీవుడై కనిపించాడు. హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో రవీంద్రనాథ్ చౌదరి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు.

ఇటీవలే మాగంటి బాబు పెద్దకుమారుడు రాంజీ కన్నుమూశారు. ఇప్పుడు రెండో కుమారుడు కూడా చనిపోవడంతో మాగంటి బాబు కుటుంబం తల్లడిల్లిపోతోంది. రవీంద్రనాథ్ చౌదరి ఇటీవలే ఆసుపత్రిలో చికిత్స పొందగా, ఆసుపత్రి నుంచి మధ్యలోనే ఆయన వచ్చేసినట్టు సమాచారం. అప్పటినుంచి హైదరాబాదులోని స్టార్ హోటల్లోనే ఉంటున్నట్టు తెలుస్తోంది.

కాగా, రవీంద్రనాథ్ చౌదరి మృతి పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు చనిపోయాడన్న మరణవార్తతో దిగ్భ్రాంతికి గురైనట్టు వెల్లడించారు. ఇటీవల పెద్ద కొడుకు రాంజీ మరణంతో శోకసంద్రంలో ఉన్న మాగంటి బాబు కుటుంబంలో రవీంద్రనాథ్ మృతి అంతులేని విషాదాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నట్టు వివరించారు.
Raveendranath Chowdary
Death
Maganti Babu
Ramjee

More Telugu News