Daggubati Purandeswari: కొత్త వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసిన జగన్ ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?: పురందేశ్వరి

Purandeswari questions CM Jagan after her laid foundation stone for new medical colleges
  • ఏపీలో కొత్త వైద్య కళాశాలలకు శంకుస్థాపన
  • వర్చువల్ విధానంలో హాజరైన సీఎం జగన్
  • విమర్శలు గుప్పించిన బీజేపీ అగ్రనేతలు
  • చికిత్స కోసం పేదలు ఎక్కడికి వెళ్లాలన్న పురందేశ్వరి
  • పైపై మెరుగులు అద్దుతున్నారన్న దేవధర్
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేయడంపై బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీ సీఎం జగన్ వర్చువల్ విధానంలో ఒకేసారి 16 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేశారని, కానీ ఆయన ఎప్పుడైనా రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు, వసతుల గురించి ఆలోచించారా? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నించారు. చికిత్స కోసం పేదలు ఎక్కడికి వెళ్లాలని ఆమె నిలదీశారు. విశాఖలోని కేజీహెచ్ లో తగినన్ని పడకలు లేవని, ఈ కారణంగా ఒకే బెడ్ పై ఇద్దరు గర్భిణీ స్త్రీలను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె విమర్శించారు. ఈ మేరకు పురందేశ్వరి ట్వీట్ చేశారు.

పురందేశ్వరి ట్వీట్ ను పంచుకున్న ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్ కూడా స్పందించారు. ఏపీ ప్రజారోగ్యం కోసం తాను అనేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం జగన్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని వైద్య వ్యవస్థకు పైపై మెరుగులు అద్ది ప్రజలను మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పు చేసి తెచ్చిన డబ్బంతా ఉచిత పథకాలకు వెళుతుంటే, కొత్త పథకాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అని దేవధర్ ప్రశ్నించారు.
Daggubati Purandeswari
Jagan
Sunil Deodhar
Medical Colleges
Andhra Pradesh

More Telugu News