Judge Ramakrishna: జడ్జి రామకృష్ణ బ్యారెక్‌లో కత్తి ఉందన్న కుమారుడు.. అది ప్లాస్టిక్ ముక్కేనన్న జైలు అధికారి!

its not knife its just a plastic piece says jail authorities
  • తనపై కుట్ర జరుగుతోందని తండ్రి చెప్పారన్న వంశీకృష్ణ
  • ఆయనకేమైనా జరిగితే మంత్రి పెద్దిరెడ్డి, జగన్‌దే బాధ్యతన్న కుమారుడు
  • అది కత్తి కాదు ప్లాస్టిక్ ముక్కన్న జైలు సూపరింటెండెంట్

తన తండ్రి నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్ తమను ఆందోళనకు గురిచేస్తోందని, ఆయన బ్యారెక్‌లోనే ఉంటున్న ఓ వ్యక్తి బెడ్డింగులో కత్తి బయటపడిందని జడ్జి రామకృష్ణ కుమారుడు వంశీకృష్ణ తెలిపారు. తనపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని తండ్రి తనకు ఫోన్ చేసి చెప్పారని ఆయన పేర్కొన్నారు. తనతో మాట్లాడుతుండగానే జైలు సిబ్బంది ఆయన నుంచి ఫోన్ లాక్కున్నారని అన్నారు.

 బ్యారక్‌లో ఉన్న వ్యక్తి తన తండ్రిని బెదిరించాడని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, జగన్‌ను ఎదిరించేంతటి వాడివా?  నీ అంతు చూస్తానంటూ జడ్జి రామకృష్ణను ఇటీవల బెదిరించాడని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇప్పుడు అతడి వద్ద కత్తి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తన తండ్రికి ప్రాణహాని ఉందంటూ ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా పలువురికి లేఖలు రాసినట్టు తెలిపారు.

రామకృష్ణకు ఏమైనా జరిగిన మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జైలు అధికారులు తన తండ్రితో మరోసారి ఫోన్ చేయించి అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పించే ప్రయత్నం చేశారని వంశీకృష్ణ చెప్పారు.

కాగా, రామకృష్ణ బ్యారక్‌లో కత్తి దొరికిందన్న వార్తలపై జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి స్పందించారు. అది కత్తికాదని, మరుగుదొడ్డిలో పదునుగా ఉన్న ఓ ప్లాస్టిక్ ముక్కను చూసి రామకృష్ణ కత్తి అని అనుకున్నారని, అదే విషయాన్ని కుమారుడికి ఫోన్ చేసి చెప్పారని అన్నారు. బ్యారక్‌లో కత్తి దొరికిందన్న వార్తల్లో ఎంతమాత్రమూ వాస్తవం లేదని వేణుగోపాల్‌రెడ్డి కొట్టిపడేశారు.

  • Loading...

More Telugu News