Ambati Rambabu: 95 శాతం హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారు: జగన్ రెండేళ్ల పాలనపై అంబటి

Ambati Rambabu press meet on CM Jagan two tear administration
  • జగన్ ప్రజల్లోంచి వచ్చి సీఎం అయ్యారన్న అంబటి
  • కరోనా వేళ మెరుగైన పాలన అందిస్తున్నారని కితాబు
  • రాష్ట్రంలో విపక్షాలు బలహీనపడ్డాయని వ్యాఖ్యలు
  • చంద్రబాబు చరిత్ర ఇక ముగిసినట్టేనన్న అంబటి 
ఏపీలో సీఎం జగన్ పాలనకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఎంతో మంది సీఎంలను చూశామని, కానీ ప్రజల్లోంచి నేరుగా వచ్చి సీఎం అయినవారు చాలా తక్కువ మంది అని, వారిలో సీఎం జగన్ ఒకరని తెలిపారు. గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ విధంగా ప్రజల నుంచి వచ్చినవారేనని, వారికోవలోకే సీఎం జగన్ కూడా వస్తారని వివరించారు. ప్రజలు తాము ఎవరికి ఓటు వేస్తున్నామో చెప్పి మరీ సీఎం జగన్ ను గెలిపించుకున్నారని అంబటి పేర్కొన్నారు.

ఇవాళ అందరూ ఏపీ వైపు చూస్తున్నారంటే అందుకు కారణం సీఎం జగనే అని ఉద్ఘాటించారు. అదేసమయంలో, నాయకుడు అంటే ఇలా ఉండకూడదని చంద్రబాబు వైపు కూడా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. తనకు ఓట్లు వేయని వారిని కూడా తన వైపు తిప్పుకున్న నిజమైన నాయకుడు వైఎస్ జగన్ అని కీర్తించారు. జగన్ ప్రజాపాలన నేపథ్యంలో విపక్షాలు బలహీనపడగా, విపక్ష నేతలు బయటికే రావడంలేదని విమర్శించారు. ఇటీవల జరిగిన ఏ ఎన్నికల్లో అయినా వైసీపీ జెండా ఒక్కటే ఎగిరిందని అంబటి గర్వంగా చెప్పారు. చంద్రబాబు చరిత్ర ఇక ముగిసినట్టేనని, ఆ విషయం ప్రజలకు కూడా అర్థమైందని అన్నారు.

ఓవైపు ఏపీని కరోనా సంక్షోభం అతలాకుతలం చేసినా, సీఎం జగన్ ప్రజాసంక్షేమానికి ఏ లోటు రానివ్వలేదని, 95 శాతం హామీలు అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని వెల్లడించారు. వాస్తవానికి వైసీపీ నేతలకు ఇది పండుగ సమయం అని, కానీ దేశంలో కరోనా విలయం సృష్టిస్తున్న వేళ వేడుకలకు ఇది సమయం కాదని సంయమనం పాటిస్తున్నామని అంబటి స్పష్టం చేశారు. కరోనాపై సమష్టిపోరుకు తాము కార్యోన్ముఖులం అయ్యామని, అందరూ కలిసి రావాలని అంబటి పిలుపునిచ్చారు.
Ambati Rambabu
Jagan
Two Year Ruling
YSRCP
Andhra Pradesh

More Telugu News