Adimulapu Suresh: పదో తరగతి, ఇంటర్ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తాం: ఏపీ ప్రభుత్వం

Will definitely conduct 10th and Inter exams says AP Education minister Suresh
  • సీఎం ఆదేశాల మేరకు పదో తరగతి పరీక్షలను వాయిదా వేశామన్న విద్యామంత్రి
  • ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామన్న ఆదిమూలపు సురేశ్
  • ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు విద్యార్థులకు చాలా అవసరమని వ్యాఖ్య
ఏపీలో పదో తరగతి పరీక్షలను ఏపీ ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందిస్తూ... కరోనా నేపథ్యంలో జూన్ 7 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని చెప్పారు. ఇంటర్ పరీక్షలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించడం మాత్రం తప్పనిసరి అని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

ఈ పరీక్షల్లో వచ్చే మార్కులు విద్యార్థులకు చాలా అవసరమని సురేశ్ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కూడా పరీక్షలను నిర్వహించాలని కోరుతున్నాయని చెప్పారు. కేంద్ర స్థాయిలో నిర్వహించే నీట్, జేఈఈ వంటి పరీక్షలతో పాటు, రాష్ట్రంలో నిర్వహించే వివిధ ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఈ మార్కులు అవసరమని తెలిపారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ మనుగడ కోసం విమర్శలు చేస్తున్నాయే తప్ప... విద్యార్థుల భవిష్యత్తుపై వాటికి శ్రద్ధ లేదని మండిపడ్డారు. రాజకీయాలు మానుకోవాలని... విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన హితవు పలికారు. 
Adimulapu Suresh
Jagan
YSRCP
10th Exams
Inter Exams
Andhra Pradesh

More Telugu News