Mumbai: అదృష్టవంతుడంటే జవేరీనే.. రూ.18 వేలతో ముంబై నుంచి అతిపెద్ద విమానంలో ఒక్కడే దుబాయ్‌కి!

Man flies solo from Mumbai to Dubai on 360 seater flight for Rs 18k
  • ముంబై నుంచి ఒక్కడితోనే దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ విమానం
  • అన్ని అనుమతులు ఉన్న ఒకే ఒక్క ప్రయాణికుడు
  • విమానంలో అడుగుపెట్టగానే కరతాళ ధ్వనులతో స్వాగతం
  • తనకు దక్కిన అదృష్టాన్ని చూసి నమ్మలేకపోయిన జవేరీ
360 సీట్లున్న బోయింగ్ 777 విమానం ముంబై నుంచి దుబాయ్‌కు ఒకే ఒక్క ప్రయాణికుడితో బయలుదేరింది. ఈ ప్రయాణానికి గాను అతడు చెల్లించినది రూ. 18 వేలు మాత్రమే కాగా, విమాన ఇంధనానికి మాత్రం 8 లక్షల ఖర్చు అయింది. ఆశ్చర్యంగా ఉంది కదూ! వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 

దేశంలో కరోనా నేపథ్యంలో భారతీయ ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. అయితే, దౌత్య సిబ్బంది, యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారు, అరబ్ జాతీయులకు మాత్రం అనుమతి ఇచ్చారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన ధ్రువపత్రం తప్పనిసరి. జూన్ 14వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం అంటే ఈ నెల 19న దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన బోయింగ్ 777 విమానం తిరిగి వెళ్లేందుకు సిద్ధమైంది.

ఈ విమానంలో ప్రయాణించేందుకు దుబాయ్‌కి చెందిన ‘స్టార్‌జెమ్స్’ సీఈవో భవేష్ జవేరి (40) టికెట్ కొనుగోలు చేసుకున్నాడు. యూఏఈ విధించిన నిబంధనల ప్రకారం ఆయనకు గోల్డెన్ వీసా ఉంది. ప్రభుత్వం విధించిన అన్ని అనుమతులు ఉండడంతో అతడి ప్రయణానికి మార్గం సుగమమైంది. అయితే, ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. విమానంలోకి జవేరి అడుగుపెట్టిన వెంటనే సిబ్బంది ఆయనకు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు.

ఆ విమానంలో ప్రయాణించేది తాను ఒక్కడినేనని తెలుసుకుని తన అదృష్టాన్ని నమ్మలేకపోయాడు. అతడి లక్కీ నంబరు 18 అని తెలుసుకున్న విమాన సిబ్బంది అతడిని ఆ సీటు వద్దకు సాదరంగా తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అంతేకాదు, విమాన కమాండర్ కూడా వచ్చి జవేరిని అభినందించి వెళ్లాడు. ఈ సందర్భంగా జవేరీ మాట్లాడుతూ దుబాయ్-ముంబై వద్ద తాను వందలసార్లు ప్రయాణించానని, కానీ నేటి అనుభూతి మాత్రం మాటల్లో వర్ణించలేనిదని చెప్పుకొచ్చాడు.
Mumbai
Dubai
Emirates flight
Bhavesh Javer

More Telugu News