Yaas Cyclone: యాస్ తుపాను ప్రభావం.. మూడు లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయన్న మమత

At Least 1 Crore People Affected Due To Cyclone Yaas In Bengal
  • కోటిమందిపై ప్రభావం చూపిన తుపాను
  • 15 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
  • తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం ఏరియల్ సర్వే
యాస్ తుపాను రాష్ట్రంలో దాదాపు కోటి మందిపై ప్రభావం చూపించినట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. తుపాను వల్ల రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయని, ఒకరు మరణించారని తెలిపారు.

తుపాను ప్రభావానికి గురైన పర్బా మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తర పరగణాల జిల్లాల్లో ఎల్లుండి ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. అలాగే, తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోటి రూపాయల విలువైన సహాయక సామగ్రిని పంపించినట్టు పేర్కొన్నారు.

యాస్ తుపాను ప్రభావం రాష్ట్రంపై అధికంగా ఉందని, వాతావరణ పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా ఉందన్నారు. కాగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో బీభత్సం సృష్టించిన తుపాను ఈ ఉదయం 10.30-11.30 గంటల మధ్య ఒడిశాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది.
Yaas Cyclone
West Bengal
Mamata Banerjee

More Telugu News