IPL: ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు యూఏఈలో!

Rest of the IPL matches likely held in UAE
  • భారత్ లో కరోనా విజృంభణ
  • మే 4న వాయిదా పడిన ఐపీఎల్ 14వ సీజన్
  • భారత్ లో 29 మ్యాచ్ లు నిర్వహణ
  • ఇంకా మిగిలున్న 31 మ్యాచ్ లు
  • సెప్టెంబరు 18 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్
బయోబబుల్ కొనసాగిస్తున్నప్పటికీ ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడింది. అయితే ఈ సీజన్ లో మే 4 నాటికి 29 మ్యాచ్ లు జరగ్గా, ఇంకా 31 మ్యాచ్ లు మిగిలున్నాయి. ఈ మిగిలిన మ్యాచ్ లను యూఏఈ గడ్డపై జరిపేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 వరకు యూఏఈలో ఐపీఎల్ ను పూర్తి చేయాలని బోర్డు తలపోస్తోంది. ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్ ను అక్టోబరు 9న గానీ, 10న గానీ నిర్వహించాలని భావిస్తోంది.

బిజీ షెడ్యూల్ నడుమ మూడు వారాల సమయం దొరకడంతో రోజుకు రెండేసి మ్యాచ్ లు (డబుల్ హెడర్లు) జరిపైనా ఐపీఎల్ పూర్తిచేయాలని బీసీసీఐ వర్గాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. దీనిపై అన్ని ఫ్రాంచైజీలకు బోర్డు సమాచారం అందించినట్టు పేరు చెప్పడానికి అంగీకరించని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. 10 డబుల్ హెడర్లు (20 మ్యాచ్ లు), 7 సాయంకాలం మ్యాచ్ లు, రెండు క్వాలిఫయర్ మ్యాచ్ లు, ఒక ఎలిమినేటర్, ఫైనల్ తో కలిపి 31 మ్యాచ్ లు జరపనున్నట్టు తెలిపారు.

కాగా, భారత జట్టు మరికొన్నిరోజుల్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుండగా... సెప్టెంబరు 14న చివరి టెస్టు పూర్తయిన వెంటనే మాంచెస్టర్ నుంచి నేరుగా యూఏఈ పయనం కానున్నట్టు తెలుస్తోంది.
IPL
UAE
India
Corona Virus
BCCI

More Telugu News