Bharat: రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court hearing on Kanumuri Bharat petition
  • ఇటీవల రఘురామను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ
  • కస్టడీలో తన తండ్రిని వేధించారన్న భరత్
  • సుప్రీంలో పిటిషన్ దాఖలు
  • విచారణ చేపట్టిన ద్విసభ్య ధర్మాసనం
  • 6 వారాలకు విచారణ వాయిదా
ఏపీ సీఐడీ పోలీసులు తన తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేశారని, కస్టడీలో వేధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. సీఐడీ అధికారుల తీరుపై సీబీఐ విచారణ చేపట్టాలని భరత్ తన పిటిషన్ లో కోరారు. భరత్ పిటిషన్ ను జస్టిస్ వినీత్ శరన్, జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు.

కస్టడీలో రఘురామను చిత్రహింసలకు గురిచేయడంపై సీబీఐ దర్యాప్తును కోరుతున్నామని రోహాత్గీ సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు. అంతేకాకుండా, ప్రతివాదుల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించి మిగిలిన అందరిని  తొలగించి, సీబీఐని చేర్చేందుకు  కోర్టు అనుమతి కోరారు. రోహాత్గీ విజ్ఞప్తి మేరకు ప్రతివాదుల జాబితాలో మార్పులకు సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో, తమను ప్రతివాదుల జాబితా నుంచి తప్పించడం పట్ల ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లో సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది. అనంతరం ఈ కేసు విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.
Bharat
Raghu Rama Krishna Raju
Supreme Court
AP CID
CBI
YSRCP
Andhra Pradesh

More Telugu News