Nara Lokesh: డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేశ్.. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు!

Jagan Reddy is a sadist CM says Nara Lokesh
  • దళితులను వెంటాడి, వేధించి చంపేస్తున్నారు
  • ఆయన సీఎం జగన్ రెడ్డి  కాదు.. శాడిస్ట్ జగన్ రెడ్డి
  • డాక్టర్ కుటుంబానికి కోటి రూపాయల ఆర్థికసాయం అందించాలన్న లోకేశ్ 
గుండెపోటుతో ఇటీవల మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ ద్వారా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని... రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. ఏపీలో దళితులకు రక్షణ లేకుండా పోతోందని చెప్పారు.

జగన్ రెడ్డి దళితులను, దళిత మేధావులను వెంటాడి, వేధించి, చంపేస్తున్నాడని లోకేశ్ మండిపడ్డారు. ఆయన సీఎం జగన్ రెడ్డి కాదని... శాడిస్ట్ జగన్ రెడ్డి అని అన్నారు. దళిత డాక్టర్ సుధాకర్ గారిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని... ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఒక గొప్ప డాక్టర్ ని శాడిస్ట్ జగన్ బలితీసుకున్నాడని చెప్పారు. మాస్క్ ఇవ్వమని డాక్టర్ సుధాకర్ అడిగినందుకు ఈ శాడిస్ట్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని, నడి రోడ్డుపై పడేసి చేతులు వెనక్కి విరిచి వేధించారని అన్నారు. పిచ్చోడనే ముద్ర వేశారని దుయ్యబట్టారు.

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని హైకోర్టుకు సీబీఐ నివేదిక అందజేసిందని నారా లోకేశ్ తెలిపారు. న్యాయం జరిగే లోపే ఆయన చనిపోవడం బాధాకరమని అన్నారు. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే కాబట్టి కోటి రూపాయిలు ఆర్థిక సహాయం కుటుంబానికి అందజేయాలని అన్నారు. ఇప్పటికైనా దళితులపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చెయ్యాలని... లేనిపక్షంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని చెత్త బుట్టలో వేసి, శాడిస్ట్ జగన్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో తమకు తెలుసని అన్నారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Doctor Sudhakar

More Telugu News