Cyclone: ఏపీకి హెచ్చరిక: దూసుకొస్తున్న పెను తుపాను ‘యాస్​’

Very Severe Cyclone YAAS to Hit Bay Of Bengal By Monday
  • జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచనలు
  • తమిళనాడు, ఒడిశా, బెంగాల్, అండమాన్ కు కూడా
  • ఈ రోజు ఉదయమే బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఎల్లుండికి తీవ్ర తుపానుగా మారే ప్రమాదం
తౌతే సృష్టించిన బీభత్సం ఇంకా మరువకముందే మరో తుపాను సిద్ధమైపోతోంది. ఈరోజు ఉదయమే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. సోమవారం నాటికి తీవ్ర తుపాను ‘యాస్’ ఏర్పడుతుందని హెచ్చరించింది. ఈ నెల 26 నాటికి అది పెనుతుపానుగా రూపు దాల్చుతుందని పేర్కొంది. అదే రోజు సాయంత్రం ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు చేరుకుంటుందని వివరించింది.

అల్పపీడనం మరో మూడ్రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర సర్వీసులను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. అన్ని రకాల ఔషధాలు, ఆరోగ్య సర్వీసులను సిద్ధం చేయాలంది.

ఒడిశాలోని 14 జిల్లాల్లో అప్రమత్తతను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కొనేందుకు సమాయత్తమవ్వాలని నౌకాదళం, తీర రక్షక దళాలను ఒడిశా ప్రభుత్వం కోరింది. బెంగాల్, ఒడిశా, ఏపీకి నడిపే 22 ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు రైల్వే ప్రకటించింది. తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బలగాలను మోహరించింది. ముంపు, తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Cyclone
Cyclone YAAS
Andhra Pradesh
Odisha
West Bengal

More Telugu News