Jagan: జోగి బాధలో ఆప్యాయత కనిపించింది: సీఎం జగన్

CM Jagan appreciates MLA Jogi Ramesh after his hearty speech
  • ఏపీ అసెంబ్లీలో జోగి రమేశ్ ప్రసంగం
  • రఘురామపై తీవ్ర ధ్వజం
  • తప్పులుంటే తన మాటలు తొలగించాలన్న జోగి
  • అభినందనలు తెలిపిన సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో ఆవేశపూరితంగా ప్రసంగించారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డారు.

"సీఎం జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచిన ఆ ..." అంటూ మండిపడ్డారు. గత సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు విషం కక్కుతున్నాడని, ప్రజల మనసులు గెలుచుకున్న తమ ప్రభుత్వ కార్యక్రమాలపై బురద చల్లుతున్నాడని విమర్శించారు. తద్వారా కొన్ని కోట్ల హృదయాలు గాయపడ్డాయని వివరించారు.

"ఇవాళ ఈ .... ప్రభుత్వం మీద మీసాలు తిప్పుతారు, తొడలు కొడతారు! ఈ సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా. జగన్ బొమ్మ లేకుండా, మా జెండా లేకుండా, మా అజెండా లేకుండా నువ్వు గెలవాలి. నీ ఊరేదో నాకు తెలియదు కానీ.... కనీసం నువ్వు వార్డు మెంబర్ గానైనా గెలిచే సత్తా నీకు లేదని స్పష్టం చేస్తున్నా. దమ్ముంటే రా, చూసుకుందా. పచ్చమీడియా అండతో ప్రభుత్వంపై కుట్ర చేస్తావా? కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల ఫలాలను ప్రతి ఇంటికీ అందిస్తున్న సీఎంపై కుట్రలు చేస్తావా?" అని నిప్పులు చెరిగారు. అనంతరం తన ప్రసంగంలో ఏవైనా తప్పులు ఉంటే మన్నించాలని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని జోగి రమేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు.

జోగి రమేశ్ ప్రసంగం సీఎం జగన్ ను విశేషంగా ఆకట్టుకుంది. జోగి బాధలో తనపై ఎంతో ఆప్యాయత కనిపించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు. తప్పు చేసి ఉంటే తన మాటలు రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ను కోరడం పట్ల అభినందిస్తున్నానని సీఎం జగన్ అన్నారు. 'ఇప్పుడు జోగి రమేశ్ పై మా అందరి అభిమానం కూడా కాస్త పెరిగింది' అని వ్యాఖ్యానించారు.
Jagan
Jogi Ramesh
Speech
AP Assembly Session
YSRCP
Raghu Rama Krishna Raju
Andhra Pradesh

More Telugu News