Raghu Rama Krishna Raju: కాసేపట్లో రఘురాజుకు వైద్య పరీక్షలు.. జ్యుడీషియల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు

Judicial offices reaches army hospital to inspect medical tests of Raghu Rama Krishna Raju
  • ముగ్గురు ఆర్మీ ఆసుపత్రి వైద్యులతో రఘురాజుకు వైద్య పరీక్షలు
  • ఆసుపత్రికి చేరుకున్న జ్యుడీషియల్ అధికారి నాగార్జున
  • రిపోర్టును సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో అందించనున్న టీఎస్ హైకోర్టు
వైసీపీ రెబెల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో కాసేపట్లో వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఆర్మీ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యుల బృదం ఆయనకు మెడికల్ టెస్టులు నిర్వహించనుంది.

మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను పర్యవేక్షించేందుకు హైకోర్టు రిజిస్ట్రార్ నాగార్జునను జ్యుడీషియల్ అధికారిగా హైకోర్టు నియమించింది. కాసేపటి క్రితమే ఆర్మీ ఆసుపత్రికి నాగార్జున చేరుకున్నారు. ఈయన పర్యవేక్షణలో ఆర్మీ ఆసుపత్రి వైద్యులు రఘురాజుకు అన్ని పరీక్షలను నిర్వహించనున్నారు.

మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేయనున్నారు. టెస్టు రిపోర్టులను తెలంగాణ హైకోర్టు సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు అందజేయనుంది. మరోవైపు, తాము తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు రఘురాజును ఆసుపత్రిలోనే ఉంచాలని సుప్రీం స్పష్టం చేసింది. ఆసుపత్రిలో ఉన్న కాలాన్ని రిమాండ్ లో ఉన్నట్టుగా భావించాలని తెలిపింది.

మరోవైపు, ఆసుపత్రి వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో ఇది ఆర్మీ ఆసుపత్రి అయిన నేపథ్యంలో, సైనికాధికారులు మీడియాను కూడా సమీపంలోకి రానివ్వడం లేదు. ఇంకోవైపు, ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే మెడికల్ రిపోర్టులో ఎలాంటి విషయాలు వెలుగుచూస్తాయో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.
Raghu Rama Krishna Raju
YSRCP
Medical Tests
Army Hospital
Judicial Officers

More Telugu News