Goa: తౌతే విశ్వరూపం.... గోవాకి విమానాలు రద్దు, కేరళలో బీభత్సం

All flights cancelled in Goa due to Tauktae cyclone effect
  • అరేబియా సముద్రంలో కొనసాగుతున్న తౌతే
  • పాంజిమ్ కు వాయవ్య దిశగా కేంద్రీకృతం
  • కేరళలో పొంగిపొర్లుతున్న డ్యాములు
  • కర్ణాటకలో 73 గ్రామాలు అతలాకుతలం
  • గుజరాత్ దిశగా దూసుకెళుతున్న తౌతే
అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌతే తుపాను అతి తీవ్ర తుపానుగా కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం 3.30 గంటల సమయానికి తౌతే గోవాలోని పాంజిమ్ కు పశ్చిమ వాయవ్య దిశగా 120 కిలోమీటర్ల దూరంలో, ముంబయికి దక్షిణంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావం గోవాపైనా అధికంగానే ఉంది.

తుపాను మరింత తీవ్రరూపు దాల్చుతుండడంతో గోవాకు అన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. గోవాలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. భారీ వర్షాలు, బలమైన గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు ఒకరు మృతి చెందినట్టు అధికారిక సమచారం వెల్లడిస్తోంది. గోవాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అటు కేరళ, కర్ణాటకలోనూ తౌతే భారీ వర్షాలు, వరదలకు కారణమైంది. కేరళలో అనేక డ్యాములు పొంగిపొర్లుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ణాటకలో 6 జిల్లాలపై తౌతే ప్రభావం అధికంగా ఉంది. 73 గ్రామాలు అతలాకుతలం కాగా, నలుగురు మృత్యువాతపడ్డారు.

తౌతే తుపాను గుజరాత్ దిశగా పయనిస్తుండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. 150 మంది సభ్యులు గల 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పుణే నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ బయల్దేరాయి.
Goa
Flights
Tauktae
Cyclone
Kerala
Karnataka
Gujarath

More Telugu News