Kanumuri Bharat: కేంద్ర హోంశాఖకు 12 పేజీల లేఖ రాసిన రఘురామకృష్ణరాజు తనయుడు భరత్

  • ఈ నెల 14న రఘురామ అరెస్ట్
  • హైదరాబాదులో అరెస్ట్ చేసి ఏపీకి తరలించిన సీఐడీ బృందం
  • కాలికి గాయాలతో కోర్టు వద్దకు రఘురామ
  • తన తండ్రిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న భరత్
Kanumuri Bharat wrote Union home ministry

తన తండ్రి రఘురామకృష్ణరాజును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తనయుడు కనుమూరి భరత్ ఆక్రోశిస్తున్నారు. ఈ క్రమంలో భరత్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. పోలీస్ కస్టడీలో తన తండ్రిని చిత్రహింసలకు గురిచేశారని భరత్ తన లేఖలో ఆరోపించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. భరత్ తన లేఖతో పాటు రఘురామ కాలి గాయాల ఫొటోలను కూడా జోడించారు.

ఏపీలో భారత రాజ్యాంగం అమలు కావడం లేదని, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వెలిబుచ్చారు. తన తండ్రిని ఏపీ సీఐడీ అధికారి సునీల్ కుమార్ బృందం ఈ నెల 14న అదుపులోకి తీసుకుందని, విచారణ పేరుతో రాత్రంతా హింసించారని భరత్ వెల్లడించారు. ఓ ఎంపీ అని కూడా పట్టించుకోకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.

పోలీసుల దెబ్బలకు ఆయన శరీరంపై గాయాలు తగిలాయని, సరిగా నడవలేని స్థితిలో ఉన్నారని వివరించారు. అవి కొట్టడం వల్ల ఏర్పడిన దెబ్బలే అయితే కఠినచర్యలు తప్పవని కోర్టు కూడా పోలీసులను హెచ్చరించిన విషయాన్ని భరత్ తన లేఖలో ప్రస్తావించారు. చట్టాలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఉల్లంఘించిన వారిని ఉపేక్షించరాదని తన లేఖలో కోరారు.

More Telugu News