Pavan: ముందుగా 'వకీల్ సాబ్' కథ బాలకృష్ణ దగ్గరికి వెళ్లిందా?
- హిందీ రీమేక్ గా వచ్చిన 'వకీల్ సాబ్'
- ఆసక్తిని చూపని బాలయ్య
- త్రివిక్రమ్ దగ్గర ప్రస్తావించిన దిల్ రాజు
- పవన్ ను కలిపిన త్రివిక్రమ్
కరోనా ప్రభావం రెండోసారి విజృంభించడానికి ముందు థియేటర్లలో సందడి చేసిన సినిమా 'వకీల్ సాబ్'. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. పవన్ రీ ఎంట్రీ ఈ సినిమాతోనే జరిగింది. కథాకథనాల పరంగా .. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. ఇంకా ఈ సినిమా దూసుకుపోయేదే. అయితే కరోనా ఎఫక్ట్ వలన థియేటర్ల దగ్గర జనం పలచబడుతూ వచ్చారు. పవన్ జోష్ ఎంతమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా ఇది. ఆయన అభిమానులకు పూర్తిస్థాయి సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇది.
ఈ సినిమాను గురించి తాజాగా ఒక వార్త వినిపిస్తోంది. దిల్ రాజు 'పింక్' సినిమాను రీమేక్ చేద్దామని అనుకున్నప్పుడు, ముందుగా బాలకృష్ణను కలిశారట. కథ విన్న బాలకృష్ణ అంతగా ఆసక్తిని చూపలేదట. ఆ తరువాత మాటల సందర్భంలో ఈ కథను గురించి త్రివిక్రమ్ దగ్గర దిల్ రాజు ప్రస్తావించారట. అప్పుడు పవన్ రీ ఎంట్రీ ఆలోచన గురించిన చెప్పిన త్రివిక్రమ్, ఆయనకి ఈ కథను వినిపించమని చెప్పారట. అది పవన్ కి నచ్చడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అలా 'వకీల్ సాబ్' పవన్ ను మళ్లీ అభిమానుల ముందుకు తీసుకొచ్చాడన్న మాట.