KCR: లాక్ డౌన్ దిశగా తెలంగాణ? నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

KCT to take decision on lockdown in todays cabinet meeting
  • తెలంగాణలో పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు
  • ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • ఈ మధ్యాహ్నం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం
కరోనా మహమ్మారి ప్రస్తుత సెకండ్ వేవ్ లో పంజా విసురుతోంది. నగరాలను దాటిపోయి గ్రామీణ ప్రాంతాల్లో సైతం పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి విధిలేని పరిస్థితుల్లో ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆందోళనకర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో లాక్ డౌన్ విధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన అజెండాలో లాక్ డౌన్ విధించే అంశమే కీలకమని చెపుతున్నారు. సంపూర్ణ లాక్ డౌన్ విధించడంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అయితే, ఈ కర్ఫ్యూ వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. పాజిటివ్ కేసులు యథావిధిగా భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో, లాక్ డౌన్ విధించడమే బెటర్ అనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. మరి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
KCR
TRS
Telangana
Lockdown

More Telugu News