Jagan: అన్నీ తెలిసి కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు: సీఎం జగన్

CM Jagan reviews covid situations and vaccination
  • కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష
  • వ్యాక్సినేషన్, 104 అంశాలపై చర్చ
  • 104 వ్యవస్థ బలోపేతం కావాలని సూచన
  • వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని వెల్లడి
  • కేంద్ర నిర్ణయం మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వివరణ
కొవిడ్ ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ తో ఏపీ సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని స్పష్టం చేశారు. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేస్తూ 104 వ్యవస్థ పనితీరును పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. కరోనా రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను బాగా పెంచాలని సూచించారు.

104కు కాల్ చేస్తే వెంటనే స్పందించాలని, బెడ్ అవసరం లేదంటే కొవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని వివరించారు. కరోనా బాధితుల నుంచి 104కు కాల్ వస్తే, వారికి కచ్చితంగా సాయం అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఆరోగ్యమిత్ర ఉండాలని తెలిపారు.

ఇక, ఎంతో కీలకమైన వ్యాక్సిన్ల అంశంపైనా ఆయన చర్చించారు. వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని అన్నారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని, వ్యాక్సిన్ల ఉత్పత్తి, లభ్యత రాష్ట్ర పరిధిలోనివి కావని అందరికీ తెలుసని వివరించారు. అన్నీ తెలిసి కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

రాష్ట్రానికి నెలకు 19 లక్షల డోసులే వస్తున్నాయని, వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

అంతేకాకుండా, వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట కనిపించకూడదని ఆదేశించారు. వ్యాక్సిన్లు ఎవరికి వేస్తారనేది ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు చెప్పాలని అన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్ అందేలా చూడాలని తెలిపారు. పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వేగంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

కరోనా చికిత్సలో కీలకంగా మారిన రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. రెమ్ డెసివిర్ వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆడిటింగ్ ఉండాలని అభిప్రాయపడ్డారు.
Jagan
Covid Task Force
Andhra Pradesh
Vaccination
Corona Pandemic

More Telugu News