KCR: తెలంగాణ ఉద్యమానికి అజిత్ సింగ్ సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికారు.. ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు: కేసీఆర్‌

kcr chandra babu expressed condolence over ajit singh death
  • అజిత్ సింగ్‌ మృతి ప‌ట్ల  సంతాపం
  • రాజకీయాల్లో తనదైన ముద్రవేశారన్న కేసీఆర్‌
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్ర‌బాబు
ఆర్ఎల్డీ పార్టీ అధినేత అజిత్ సింగ్ కరోనాతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆయ‌న మృతి ప‌ట్ల తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్.. మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం తెలిపారని టీఆర్ఎస్ పార్టీ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.

తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారని తెలిపింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని అన్నారని టీఆర్ఎస్ పేర్కొంది. అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారని చెప్పింది.

మరోపక్క, అజిత్‌సింగ్ మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. అజిత్‌సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ఆయన ట్వీట్ చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఆయ‌న గొప్ప సేవలందించారని, ఆయ‌న‌ రైతుల కోసం పోరాడార‌ని అన్నారు.
KCR
Chandrababu
ajit singh

More Telugu News