Etela Rajender: కొన్ని ఛానళ్లు ముందస్తు ప్రణాళికతో తనపై తప్పుడు ప్రచారం చేశాయి: ఈటల రాజేందర్

  • హాచరీస్ కోసం అసైన్డ్ భూమిని తీసుకున్నాం
  • దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మార్వో వద్దే ఉన్నాయి
  • నాకు ఆత్మగౌరవం కంటే ఏదీ ముఖ్యం కాదు
Etela Rajender responds on allegations on him

భూకబ్జా ఆరోపణలను ఎదుర్కొంటున్న తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ మీడియా ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను ప్రేమను, గౌరవాన్ని సంపాదించుకున్నానని... అయితే, కొన్ని టీవీ ఛానళ్లు తనపై కట్టుకథలు అల్లుతూ వార్తలను ప్రసారం చేశాయని అన్నారు. ఇది దుర్మార్గమైనదని, అసహ్యకరమైనదని చెప్పారు. ముందస్తు ప్రణాళికతో ఈ వార్తలను ప్రసారం చేశారని దుయ్యబట్టారు.  అంతిమ విజయం ధర్మానిదేనని తెలిపారు. తాత్కాలికంగా న్యాయం అపజయం పొందవచ్చని వ్యాఖ్యానించారు.  

2016లో ఒక పెద్ద హ్యాచరీ పెట్టాలని తాను అనుకున్నానని... చదువుకుని వచ్చిన తన కుమారుడిని కూడా తమ వ్యాపారంలో కొనసాగించాలని జమునా హ్యాచరీస్ ను ప్రారంభించానని చెప్పారు. హ్యాచరీస్ కోసం 40 ఎకరాల భూమిని కొన్నామని వెల్లడించారు. దీనికోసం బ్యాంకు నుంచి రూ. 100 కోట్ల లోన్లు కూడా తీసుకున్నానని తెలిపారు. హ్యాచరీస్ కు చుట్టుపక్కల అసైన్డ్ భూములున్నాయని, అవి  ఎందుకూ పనికి రాని భూములు  అని చెప్పారు. ఆ భూములను తీసుకొమ్మని రైతులు కోరితే ఎవరూ ఆ భూములను  కొన కూడదు.. మీరే  ఆ భూములను ప్రభుత్వానికి సరెండర్ చేయమని చెప్పానని, దానికి సంబంధించిన పత్రాలు ఎమ్మార్వో వద్దే ఉన్నాయి అని చెప్పారు.

2004లోనే తన కోళ్ల ఫారాలలో దాదాపు 10 లక్షల కోళ్లు ఉండేవని ఈటల తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజవర్గంలో కూడా లక్ష కోళ్లు ఉండే ఫారం ఉండేదని... దాన్ని అమ్మేశానని చెప్పారు. 2004కు ముందే తనకు 120 ఎకరాలకు పైగా భూమి ఉందని తెలిపారు. జమున హాచరీస్ కోసం రైతుల దగ్గర నుంచి తాను ఒక్క ఎకరా భూమిని కూడా లాక్కోలేదని... వారే తన వద్దకు వచ్చి భూమిని అప్పజెప్పారని అన్నారు. తాను ఆత్మను అమ్ముకునే మనిషిని కాదని చెప్పారు. ఆత్మగౌరవాన్ని, ధర్మాన్ని నమ్ముకున్న వ్యక్తినని తెలిపారు. తన ఇంట్లో ఎప్పుడూ పొయ్యి వెలిగే ఉంటుందని... లక్షల మంది ఇక్కడ భోంజేశారని... అన్నం పెట్టకుండా ఎవరినీ పంపించమని చెప్పారు.

More Telugu News