Uttar Pradesh: ఆక్సిజన్​ కోసం రావి చెట్టు కింద కూర్చోవాలట.. ఇదీ యూపీ పోలీసుల తీరు!

Sit under pipal tree for oxygen helpless Covid patients in UPs Prayagraj told by police
  • ప్రయాగ్ రాజ్ లో ఘటన
  • ఆక్సిజన్ ప్లాంట్ల ముందు జనం క్యూ
  • ఆసుపత్రులకు వెళితే బెడ్లన్నీ ఫుల్
  • ప్రాణవాయువు కోసం రోగుల బంధువుల తంటాలు
  • ప్లాంట్ల దగ్గరకు వెళితే తరుముతున్న పోలీసులు
ఆక్సిజన్ అందక చాలా మంది కరోనా పేషెంట్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. వారి కుటుంబసభ్యులు ఆక్సిజన్ సిలిండర్లు పట్టుకుని ప్లాంట్ల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఆక్సిజన్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో చేర్చుదామన్నా బెడ్లన్నీ ఫుల్ అయిన పరిస్థితి. ప్రైవేట్ లోనూ అంతే. ఇంతటి తీవ్రమైన పరిస్థితుల మధ్య పోలీసులు కరోనా పేషెంట్ బంధువులకు వింత పరిష్కారాలు చెబుతున్నారు. ‘రావి చెట్టు కింద కూర్చోబెట్టండి.. ఆక్సిజన్ దానంతట అదే పెరుగుతుంది’’ అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.

ఈ పరిస్థితి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో చాలా మంది పేషెంట్లకు ఎదురైంది. కరోనా సోకిన తన తల్లిని ఆసుపత్రికి తీసుకువెళితే ఆక్సిజన్ సిలిండర్లుగానీ, క్యాన్లుగానీ, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు గానీ లేవన్నారని, ఆక్సిజన్ కోసం అక్కడి రావి చెట్టు కింద కూర్చోపెట్టాలంటూ పోలీసులు సూచించారని ఓ కరోనా పేషెంట్ కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికీ పోలీసులు ఇదే విషయం చెబుతున్నారని మరో వ్యక్తి అన్నారు.

తరిమి కొడుతున్నారు..

ఈ రోజు ప్రయాగ్ రాజ్ బీజేపీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ వాజ్ పేయి ఆక్సిజన్ ప్లాంట్ ముందు చాలా మంది కరోనా పేషెంట్ల బంధువులు గుమిగూడారు. ఆక్సిజన్ కోసం డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్లాంట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దాని ద్వారా ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేస్తోంది. అయితే, అక్కడా ఆక్సిజన్ కొరత ఉండడంతో ఎవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడకు వచ్చిన వారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

కరోనా పేషెంట్లు ఇంట్లోనే ఉండాలంటూ చెబుతున్నారని, కానీ, ఇంట్లోనూ ఆక్సిజన్ అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని ఓ రోగి తాలూకు బంధువు కన్నీరుమున్నీరయ్యాడు. ఆసుపత్రులకు వెళితే అక్కడ బెడ్లన్నీ ఫుల్ అయిపోయాయని అన్నాడు. తన తండ్రికి ఆక్సిజన్ కోసం ఎన్ని ప్లాంట్లు తిరిగినా దొరకట్లేదన్నాడు. ప్లాంట్ దగ్గరకు వస్తే మాట్లాడేవారే ఉండరని వాపోయాడు. ఒక్కసారి మాట్లాడే చాన్స్ ఇవ్వాలని కోరినా.. పోలీసులు తరిమికొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Uttar Pradesh
Oxygen
Police
Pipal Tree
COVID19

More Telugu News