India: అమెరికా నుంచి ఇండియాకు అందిన తొలి కొవిడ్ షిప్ మెంట్... అండగా నిలుస్తామని  హామీ!

First Flight With Covid Equipment from US Landed in New Delhi
  • ఈ ఉదయం న్యూఢిల్లీలో ల్యాండ్ అయిన గెలాక్సీ మిలిటరీ
  • ఆక్సిజన్ సిలిండర్లు, టెస్ట్ కిట్లతో వచ్చిన యూఎస్ విమానం
  • మరిన్ని విమానాలు వస్తాయన్న యూఎస్ ఎంబసీ
అమెరికా నుంచి అత్యవసర కొవిడ్ ఉపకరణాల విమానం ఈ ఉదయం భారత్ కు చేరింది. కరోనా రెండో వేవ్ ఇండియాను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతూ, రోజుకు దాదాపు 4 లక్షలకు కేసులు పెరుగుతున్న వేళ, అమెరికా నుంచి తొలి షిప్ మెంట్ అందింది. ఇందులో భాగంగా 400 ఆక్సిజన్ సిలిండర్లు, 10 లక్షల ర్యాపిడ్ కరోనా వైరస్ టెస్ట్ కిట్లు, ఇతర ఆసుపత్రి ఉపకరణాలను మోసుకుని వచ్చిన సూపర్ గెలాక్సీ మిలిటరీ ట్రాన్స్ పోర్టర్స్ విమానం, ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఉదయం ల్యాండ్ అయింది.

ఇందుకు సంబంధించిన చిత్రాలను భారత్ లోని యూఎస్ ఎంబసీ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తాము పంపనున్న ఎన్నో విమానాల్లో ఇది మొదటిదని, ఇరు దేశాల మధ్యా ఉన్న 70 సంవత్సరాల అనుబంధం మరింత బలోపేతమైందని వ్యాఖ్యానించింది. కొవిడ్-19పై ఇండియా చేస్తున్న పోరాటానికి అమెరికా తనవంతు సహకారాన్ని అందిస్తుందని, మరిన్ని ప్రత్యేక విమానాల్లో కరోనాను నియంత్రించే షిప్ మెంట్స్ రానున్నాయని వెల్లడించింది.

కాగా, ఈ వారం ప్రారంభంలో అమెరికాకు మద్దతుగా నిలుస్తామని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనా ప్రారంభదశలో తమ దేశంలోని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు తక్కువగా ఉన్న సమయంలో ఇండియా ఆదుకుందని గుర్తు చేసుకున్న ఆయన, ఇప్పుడు వారికి తాము సహాయం చేస్తామని స్పష్టం చేశారు. అత్యవసర సాయం కింద ఇండియాకు 100 మిలియన్ డాలర్ల విలువైన పరికరాలను, ఔషధాలను పంపుతామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

India
USA
COVID19
Corona Virus
Flight

More Telugu News