Shyamala: నా భర్త ఎలాంటివాడో నాకు తెలుసు... అవన్నీ తప్పుడు ఆరోపణలు: యాంకర్ శ్యామల
- యాంకర్ శ్యామల భర్త అరెస్ట్
- ఓ మహిళను కోటి మేర మోసం చేశాడంటూ ఆరోపణలు
- ఇదో కల్పిత కథ అంటూ శ్యామల స్పందన
- మీడియా వాస్తవాలనే చూపించాలని విజ్ఞప్తి
- తప్పుడు కేసు కాబట్టి తామేమీ బాధపడడంలేదని వ్యాఖ్యలు
ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డి కోటి రూపాయల మేర మోసం చేశాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం, రాయదుర్గం పోలీసులు నర్సింహారెడ్డిని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై యాంకర్ శ్యామల స్పందించారు. తన భర్త ఎలాంటివాడో తనకు తెలుసని, తన భర్తపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలేనని కొట్టిపారేశారు. త్వరలో నిజానిజాలు బయటికి వస్తాయని అన్నారు. మీడియా కూడా వాస్తవాలను చూపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కేసులో మరో మహిళను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల శ్యామల స్పందిస్తూ, తన భర్త గురించి తాను మాట్లాడగలను కానీ, మరో మహిళ గురించి తానేం మాట్లాడగలనని అన్నారు. ఈ కేసు గురించి తాను కూడా పూర్తి వివరాలు తెలుసుకోవాల్సి ఉందని శ్యామల పేర్కొన్నారు. తన భర్త నర్సింహారెడ్డితో మాట్లాడి వాస్తవాలు నిర్ధారించుకుంటానని, కుటుంబంలోని పెద్దవాళ్లతో ఈ విషయం చర్చించి ముందుకు వెళతామని వివరించారు. తన మామయ్యకు ఈ వ్యవహారంపై సమాచారం అందించానని వెల్లడించారు. ఇది తప్పుడు కేసు అని, అందుకే తామేమీ బాధపడడంలేదని శ్యామల వ్యాఖ్యానించారు.