Arvind Kejriwal: 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఫ్రీ.. కంపెనీలు వ్యాక్సిన్ ధరను తగ్గించాలి: కేజ్రీవాల్

Covid vaccine is free for above 18 years age says Kejriwal
  • శనివారం నుంచి ఉచిత వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది
  • ఈరోజు 1.34 కోట్ల వ్యాక్సిన్ లకు ఆర్డర్ పెట్టాం
  • కంపెనీలు వ్యాక్సిన్ ధరను రూ. 150కి తగ్గించాలి
ఢిల్లీలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శనివారం నుంచి ఉచిత వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 1.34 కోట్ల వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు ఈరోజు తాము ఆర్డర్ పెట్టామని తెలిపారు. ఈ వ్యాక్సిన్ వీలైనంత త్వరలో రాష్ట్రానికి అందుతుందని భావిస్తున్నామని... వ్యాక్సిన్ అందిన వెంటనే ఉచిత వ్యాక్సినేషన్ ను ప్రారంభిస్తామని చెప్పారు.

అయితే, ఈ ఉచిత వ్యాక్సినేషన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునే వారు మాత్రం ధరను చెల్లించాల్సి ఉంటుంది.

మరోవైపు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలకు కేజ్రీవాల్ ఒక విన్నపం చేశారు. ఒక డోసు ధరను రూ. 150కి తగ్గించాలని కోరారు. మీరు జీవిత కాలం లాభాలను సంపాదించాలంటే ఈ పని చేయాలని చెప్పారు. ఒక మహమ్మరి తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో ధరలను పెంచడం సరికాదని అన్నారు. వ్యాక్సిన్ ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపాలని కోరారు.

వ్యాక్సిన్లను తయారు చేస్తున్న ఓ సంస్థ ఒక డోసును రూ. 400కి ఇస్తామని చెప్పిందని... మరో కంపెనీ రూ. 600కి ఇస్తామని చెప్పిందని కేజ్రీవాల్ తెలిపారు. ఈ రెండు కంపెనీలు ఒక్కో డోసును రూ. 150కే ఇవ్వాలని కోరారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ డోసు ధర ఒకేలా ఉండాలని అన్నారు.
Arvind Kejriwal
AAP
Covid Vaccine
Free Vaccine
Delhi

More Telugu News