New Delhi: ఢిల్లీలో కరోనా ఉగ్రరూపం.. ఒక్క రోజే 306 మందిని బలిగొన్న వైరస్

In Delhi yesterday alone 306 covid patients died
  • పది రోజుల్లో 1,750 మంది మృతి
  • శ్మశానాల్లో అంత్యక్రియలకు దొరకని చోటు
  • మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకోవాల్సిన పరిస్థితి
ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. వందలాదిమంది ప్రాణాలను బలిగొంటోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా 306 మంది మృతి చెందారు. వారం రోజుల క్రితం 104గా ఉన్న మరణాల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.

సోమవారం నుంచి 200కు తగ్గకుండా మరణాలు నమోదవుతున్నాయి. ఆ రోజు 240 మంది, మంగళవారం 277 మంది, బుధవారం 249 మంది, గురువారం 306 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గత పదిరోజుల్లో ఏకంగా 1,750 మంది మృతి చెందడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఢిల్లీలో కరోనా వైరస్ చెలరేగిపోవడానికి యూకే స్ట్రెయినే ప్రధాన కారణమని తాజాగా వెల్లడైంది.

మరోవైపు, కరోనా మృతుల అంత్యక్రియలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శ్మశానాల్లో ఖాళీ లేకపోవడంతో మృతదేహాన్ని రెండు రోజులపాటు ఇంట్లోనే పెట్టుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలోని సీమాపురి శ్మశానవాటికలో అంత్యక్రియలకు చోటులేక పార్కింగ్ స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సామూహిక దహనవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మొన్న ఒక్కరోజే ఇక్కడ 75 మందికి అంత్యక్రియలు జరిగాయి.
New Delhi
COVID19
Deaths
Graveyard

More Telugu News