Narendra Modi: క‌రోనాపై సీఎంల‌తో మోదీ కీల‌క భేటీ

  • పాల్గొన్న 10 రాష్ట్రాల సీఎంలు
  • రాష్ట్రాల్లో తీసుకుంటోన్న చ‌ర్య‌లపై చ‌ర్చ‌
  • ఆక్సిజ‌న్ కొర‌త అంశాన్ని లేవ‌నెత్తిన కేజ్రీవాల్
Prime Minister Narendra Modi chairs a meeting with the Chief Ministers

క‌రోనా ఉద్ధృతి, తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌పై చ‌ర్చించేందుకు ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ వ‌ర్చువ‌ల్ విధానంలో స‌మావేశ‌మ‌య్యారు. ఇందులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక‌రే స‌హా క‌రోనా తీవ్రత అధికంగా ఉన్న‌ దాదాపు 10  రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటోన్న చ‌ర్య‌లు, ఆసుప‌త్రుల్లో రోగులకు ఎదుర‌వుతున్న ఇబ్బందులు, ఆక్సిజ‌న్ కొర‌త వంటి అంశాల‌పై మోదీ చ‌ర్చిస్తున్నారు.

త‌మ రాష్ట్రాల్లో ఉన్న స‌మ‌స్య‌ల గురించి ఆయ‌న‌కు సీఎంలు వివ‌రిస్తున్నారు. ఢిల్లీలో ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఉంద‌ని అర‌వింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్ లేద‌ని, ఢిల్లీకి స‌ర‌ఫ‌రా అవుతోన్న‌ ఆక్సిజ‌న్ ను ఇత‌ర రాష్ట్ర (హ‌ర్యానా) ప్ర‌భుత్వం అడ్డుకుంటుంటే తాము కేంద్ర ప్ర‌భుత్వంలో ఎవ‌రితో ఈ విష‌యంపై మాట్లాడాలో చెప్పాల‌ని మోదీని కేజ్రీవాల్ అడిగారు.

కాగా, కాసేప‌ట్లో మోదీ దేశంలోని ప్ర‌ముఖ ఆక్సిజ‌న్ త‌యారీ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తోనూ స‌మావేశం అవుతారు. మ‌రోవైపు, ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా విష‌యంలో ఢిల్లీ, హ‌ర్యానా ప్ర‌భుత్వాల మ‌ధ్య వివాదం రాజుకుంది. త‌మ ఆసుప‌త్రుల‌కు ఆక్సిజ‌న్ ట్యాంకుల‌ను త‌ర‌లించ‌కుండా హ‌ర్యానా ప్ర‌భుత్వం ఆక్సిజ‌న్ ఉత్పాద‌క సంస్థ‌ల విక్ర‌య‌దారుల‌ను అడ్డుకుంటోంద‌ని ఢిల్లీలోని ప‌లు ఆసుప‌త్రులు ఆందోళ‌న వ్య‌క్తం చేశాయి. మరోపక్క, ఫ‌రీదాబాద్ కు వెళ్తున్న త‌మ ఆక్సిజ‌న్ ట్యాంకర్‌ను ఢిల్లీలో అడ్డుకుని దాన్ని చోరీ చేశారంటూ హ‌ర్యానా ప్ర‌భుత్వం ఆరోపించింది.  

More Telugu News