Poverty: భారత్‌లో పేదలను రెట్టింపు చేసిన కరోనా మహమ్మారి!

Coronavirus Doubled poverty in India
  • వచ్చే నెలకల్లా వైరస్‌ను అదుపు చేయకుంటే దారుణ పరిస్థితులు
  • 6 కోట్లుగా ఉన్న పేదల సంఖ్య 13.4 కోట్లకు
  • అమెరికా సంస్థ అధ్యయనంలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దాని దెబ్బకు కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. అంతేకాదు, మరెంతోమందిని నిరుపేదలుగా మార్చింది. ఇక, భారత్‌లో కరోనా మహమ్మారి పేదల సంఖ్యను రెట్టింపు చేసింది.

ఈ క్రమంలో, కరోనా వల్ల గతేడాది భారత్‌లో పేదరికం రెండింతలు అయినట్టు అమెరికాకు చెందిన ‘పియో పరిశోధనా కేంద్రం’ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. లాక్‌డౌన్ కారణంగా అత్యధిక శాతం మంది ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయారని అధ్యయనం వెల్లడించింది. ఫలితంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు దారుణంగా పడిపోయిందని వివరించింది.

భారత్‌లో 6 కోట్లుగా ఉన్న నిరుపేదలు (రోజుకు రూ. 150 కంటే తక్కువ సంపాదించేవారు) గతేడాది కరోనా కారణంగా 13.4 కోట్లకు పెరిగారని ‘పియో’ అధ్యయనం వెల్లడించింది. అలాగే, రోజువారీ ఆదాయం రూ. 750-1500 మధ్య ఉన్న మధ్య తరగతి జనాభా సంఖ్య 9.9 కోట్ల నుంచి 6.6 కోట్లకు పడిపోయింది. ఇక, భారత్ ఆర్థిక వ్యవస్థపై కరోనా రెండో దశ ప్రభావం కూడా ఊహించిన దానికంటే  దారుణంగా ఉంటుందని జపాన్‌లోని నోముర రీసెర్చ్ సంస్థ (ఎన్ఆర్ఐ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వచ్చే నెలకల్లా వైరస్‌ను కట్టడి చేయకుంటే ఆర్థిక వ్యవస్థ మరింత కునారిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
Poverty
India
Corona Virus

More Telugu News